తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులు అయ్యారు.
ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాలో షెకావత్ మాదిరిగా… మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టేశారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.
సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది,. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని పట్టేసి… కంటెయినర్ ను ఓపెన్ చేయగా… రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఇంకేముంది… కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం… పట్టుబడ్డ స్మగ్లర్లను అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కి పంపింది.