ఏపీలో మందుబాబులకు షాకివ్వనున్న సర్కార్.. ధరలు భారీగా పెరుగుదల..!!
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది;
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ప్రభుత్వం మద్యం దుకాణదారులకు చెల్లించే మార్జిన్ పెంచేందుకు ఆమోదం తెలిపిందని సమాచారం. అదే జరిగితే ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి.
గత కొద్ది రోజుల నుంచి లిక్కర్ షాపుల యజమానులు తమకు ఇస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మార్జిన్ ను పెంచేందుకు అనుమతించినట్లు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విధానంలో మద్యం దుకాణాలను కేటాయించింది. లక్షలు చెల్లించి మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న వారు తమకు మార్జిన్ సరిపోవడం లేదని, నిర్వహణ కూడా కష్టమవుతుందని చెబుతుండటంతో ప్రభుత్వం మార్జిన్ ను పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
2024 అక్టోబర్ 16 నుంచి మూడు వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఆంధ్రప్రదేశ్ లో వేలం ద్వారా దక్కించుకున్నారు. మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20 శాతం కమీషన్ లభిస్తుందని భావించారు. కానీ అంత మొత్తంలో కమీషన్ లభించకపోవడంతో తమకు పాడిన మొత్తానికి వడ్డీలు చెల్లించలేకపోతున్నామని యజమానులు ఆందోళనలు చెందుతుతన్నారు.
డిసెంబర్లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు.ఈ నేపథ్యంలో వ్యాపారుల ఆందోళనతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై చెల్లిస్తున్న మార్జిన్ ను పెంచేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన క్యాబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని విశ్వసనీయ సమాచారం.
మార్జిన్ ను పెంచాలని…ఎన్నికల ప్రచారంలో నాణ్యమైన బ్రాండ్లతో కూడిన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు మద్యం విక్రయాలను ప్రారంభించింది. దీంతో పాటు చీప్ లిక్కర్ కూడా 99 రూపాయలకే క్వార్టర్ విక్రయాలు కూడా చేస్తుండటంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం 14.5 శాతం మార్జిన్ మద్యం దుకాణ యజమానులకు పెంచాలని నిర్ణయించడంతో అది సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇరవై శాతం వరకూ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిసింది.
మరి ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు అంగీకరిస్తుందా..? లేదా..? అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. మద్యంద ధరలు పెంచాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించిందని, కనీసం క్వార్టర్ పై పదిరూపాయలుపెరిగే అవకాశముందని తెలుస్తోంది. 99 రూపాయలకు విక్రయించే చీప్ లిక్కర్ మాత్రం యధాతధంగా విక్రయించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలను రూపొందించినట్లు చెబుతున్నారు. అదే జరిగితే కిక్కు దిగినట్లే..!!