బ్యాంక్ కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్ – లోన్ ప్రిక్లోజర్ ఛార్జీలు ఇకపై కనిపించవు, వినిపించవు!
గడువుకు ముందే రుణం తిరిగి చెల్లించే వారి నుంచి ముందస్తు చెల్లింపు ఛార్జీ లేదా జరిమానా వసూలు చేయకూడదని ప్రతిపాదిస్తూ ఆర్‌బీఐ ఒక ముసాయిదా పత్రాన్ని జారీ చేసింది.
చాలా మంది ప్రజలు వివిధ అవసరాల కోసం బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటారు, EMIల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. రుణం రకాన్ని బట్టి EMIల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కొంతమంది, ఎక్కువ ఆర్థిక భారం పడకుండా, అన్ని EMIలు కట్టి రుణం తీరుస్తారు. మరికొంతమంది, డబ్బు చేతిలోకి రాగానే, కాల పరిమితికి ముందే బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారు.
ఇలా ముందుగా చెల్లిండాన్నే లోన్ ఫోర్స్‌క్లోజర్ లేదా ప్రిక్లోజర్ అంటారు. లోన్ తీసుకున్న కస్టమర్, EMIలను పూర్తిగా చెల్లించడం బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలకు (రుణదాతలు) ప్రయోజనం, వాటికి పూర్తి స్థాయిలో వడ్డీ ఆదాయం వస్తుంది. కస్టమర్ తన లోన్ ముందుగానే క్లోజ్ చేస్తే రుణదాతలు కొంత వడ్డీ రాబడిని కోల్పోతాయి.
ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, కస్టమర్ నుంచి, ముందస్తు రుణం చెల్లింపుపై (Loan Foreclosure Or Preclosure) ఛార్జీ లేదా జరిమానా (Charge Or Penalty) వసూలు చేస్తున్నాయి. అంటే, ముందుగా రుణం తీర్చే రుణగ్రహీతల నుంచి రుణదాతలు అదనంగా వసూలు చేస్తున్నాయి, ఇకపై ఈ దందా ఆగిపోనుంది.