తాటి కల్లు రుచి చూచిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
మంథని, ఫిబ్రవరి 23, సమర శంఖం:- తెలంగాణలో సురాపానం గా భావించే తాటి కల్లు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తెలిపారు.
శనివారం ఉదయం మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో ఆయన తాటికల్లు రుచి చూశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్దంగా లభించే తాటికల్లును ప్రతి ఒక్కరు సేవించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. తాటికల్లు విశిష్టతను డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెబుతుంటారని, అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని ఆయన వివరించారు.
ప్రతి రోజు గౌడ సోదరులు ఉదయం, సాయంత్రం తాటి చెట్లు ఎక్కి తాటి కల్లు తీసి మన ఆరోగ్యం కోసం కష్టపడుతుంటారని ఆయన కొనియాడారు. కులవృత్తులను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం తాటికల్లు సేవించి కల్లు ప్రత్యేకతను చాటానని, ఈనాడు మళ్లీ మంథని కేంద్రానికి 75కిలో మీటర్ల దూరంలో ఉన్న సింగారం వచ్చి ఇక్కడి నుంచి కల్లు విశిష్టతను చెప్పడం జరుగుతుందన్నారు.
ఇంగ్లీష్ మందులైన రమ్ము, బ్రాండీ, విస్కీ, బీర్‌లాంటివి సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ఆ బాటిల్స్‌పైనే ఆరోగ్యానికి హనికరం అని రాసి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ప్రకృతి సిద్దంగా లభించే కల్లు గురించి పలు విషయాలు వివరించారు.