ఇంత చిన్న వివాదం కూడా బాబే పరిష్కరించాలా!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పాలక మండలి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలనాపాలనతో పాటు స్వామివారి దర్శనార్థం వస్తున్న లక్షలాది మంది భక్తులకు సరిపడ సౌకర్యాలను అందించేందుకు ఏర్పాటు అయిన సంస్థ. ప్రపంచంలోని అత్యున్నత ధార్మిక మండళ్లలో టీటీడీ కూడా ఒకటని చెప్పవచ్చు. ఇలాంటి అత్యున్నత స్థాయి మండలిలో సభ్యులుగా కొనసాగుతున్న వారు ఎలా ఉండాలి? రాగద్వేషాలకు అతీతంగా… ఎంతో ఓర్పు, నేర్పుతో వ్యవహరించే వారు అయి ఉండాలి. మరి ప్రస్తుతం బోర్డులో అలాంటి వారు ఉన్నారా? ఉంటే… ఓకే. మరి లేకుంటే… సరిదిద్దాల్సిందే కదా. ఇటీవలి కాలంలో బోర్డులో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే…బోర్డు సభ్యుల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు అయితే ఒకింత బలంగానే వినిపిస్తున్నాయి.
నిన్నటికి నిన్న స్వామివారి కైంకర్యాలను ఇలానే చేయాలంటూ టీటీడీకి చెందిఃన ఓ ఉద్యోగి చెబితే…. ఆ ఉద్యోగిపై పాలక మండలి సభ్యుడు నరేశ్ కుమార్ విరుచుకుపడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. అంత చిన్న విషయానికి ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే బోర్డు సభ్యుడు విరుచుకుపడాల్సిన అవసరం లేదనే చెప్పాలి. సరే.. ఏదో కోపం నషాళానికి అంటిన నేపథ్యంలో ఆ ఉద్యోగిపై సదరు సభ్యుడు విరుచుకుపడ్డారే అనుకుందాం… ఆ తర్వాత అయినా తన తప్పును ఆ సభ్యుడు సరిదిద్దుకోవాలి కదా. ఆ పనిని సదరు సభ్యుడు ఎందుకు చేయలేదు? అంతటి కఠిన స్వభావం ఆ సభ్యుడికి అవసరమా? ఈ కాఠిన్యంపై యావత్తు టీటీడీ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగినా కూడా ఆ సభ్యుడు శాంతించలేదు. చల్లబడనూ లేదు. సారీ చెప్పేందుకు ససేమిరా అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిరసనలకు మరింత ఆజ్యం పోసేలా చేశారు.
అయితే ఈ విషయం చివరకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లగా…నేరుగా ఆయన ఎంట్రీ ఇచ్చాక గానీ ఈ వ్యవహారం సద్దుమణగలేదు. నరేశ్ కుమార్ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. టీటీడీ లాంటి సంస్థల్లో ఈ తలబిరుసు తనం ఏమిటంటూ నిలదీశారట. ఇలాంటి వైఖరితో బోర్డులో కొనసాగడం కుదరదని తేల్చి చెప్పారట. సారీ చెబితే చెప్పండి… ఉద్యోగులను గౌరవించండి… లేదంటే బోర్డు నుంచి తప్పుకోండి…మీరు తప్పుకోకుంటే తామే తప్పించాల్సి వస్తుందని ఫుల్ గా క్లాస్ పీకారట. దీంతో దిగివచ్చిన నరేశ్ కుమార్…టీటీడీ ఉద్యోగికి శుక్రవారం సారీ చెప్పారు. ఉద్యోగులు నిరసనలు విరమించారు. వివాదానికి తెర పడింది. ఇంతటి చిన్న వివాద పరిష్కారానికి కూడా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు రంగంలోకి దిగాలా? ఎంత బీజేపీ ప్రతిపాదిత సభ్యుడు అయితే మాత్రం.. ఆ మాత్రం సహనం నరేశ్ కు అవసరం లేదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.