త్వరలోనే బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదారాబాద్, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయని బీఆర్ఎస్ బలం అంతా కూడా బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండు పార్టీలు కలిసి ఓడించాయన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసీ రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా? అని ప్రశ్నించారు. త్వరలో మరో పండగ వస్తుందని అప్పుడు మేము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ బలం ఇంతేనా?
తనకు పార్టీ మద్దతు ఉందని రవీందర్ సింగ్ ప్రచారం చేశారు. పరోక్షంగా రవీందర్ సింగ్ కు బీఆర్‌ఎస్ బలపరిస్తే మీ శక్తి ఇంతేనా? అని నిలదీశారు. రవీందర్ సింగ్‌కు వచ్చిన ఓట్లు ఆయన వ్యక్తిగతం అని బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నారు. బలహీన వర్గాల పట్ల నిజంగా బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీసీ అభ్యర్థిని పోటీకి దించలేదని ప్రశ్నించారు. ఓటమిపై సమీక్షించుకుంటామని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సవరించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందువల్లే మా అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికలను మా పాలనకు రెఫరెండం కాదన్నారు. మేమెక్కడా ఈ మాట చెప్పలేదన్నారు. బీజేపీ గెలిచింది కాబట్టే ఈ ఎన్నిక రెఫరెండం అని మాట్లాడుతుందన్నారు.
బీజేపీ గెలుపు అనైతికం అన్నారు. చెల్లని ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిదంని ఇది దురదృష్టకరం అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
పతనానికి మొదటి అడుగు:
బీజేపీ, బీఆర్‌ఎస్ కలవడమనేదే వాళ్ల పార్టీ పతనానికి మొదటి అడుగు అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని పలపర్చుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా శ్రమించారని సైటైర్ వేశారు. మాకు ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం అయితే మిగతా పనులను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకే వెళ్లేవాళ్లం కానీ కులగణన ప్రక్రియ పూర్తయ్యేకే ఎన్నికలకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టే ఆలస్యం అయిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక కులగణనకు సబంధించిన ఎన్నిక కాదన్నారు. కులగణన ఓట్ల కోసం చేయలేదన్నారు. 317జీవో సమస్యతో పాటు ఇతర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, పట్టభద్రులతో పాటు రాష్ట్రంలోని యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. పట్టభద్రులకు నైపుణ్యాన్ని పెంచాలని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు కోసం ప్రభుత్వం చేస్తున్న కులగణన సర్వేతో పాటు చట్టం తీసుకురావాలనే కమిట్మెంట్ తో పని చేస్తున్నామన్నారు.