ఏపీ: ఈనెల 10 నుంచి బీసీ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఫలితాలు కూడా వెలువడడంతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల కోడ్ ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాట్లకు దరఖాస్తుల స్వీకరణ నిలిపేశామన్నారు.
తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన లబ్దిదారులంతా ఈ నెల 10వ తేదీ నుంచి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా రుణాల మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత కోరారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ-స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ పొందవొచ్చునన్నారు.