పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం. ప్రతి మగవాడి విజయం వెనక ఒక తల్లి, భార్య, చెల్లి, అక్క కూతురు, ఇలా ఒక స్త్రీ మూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరు మహిళలకు సహకరించాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం మార్చి 08 పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యా లను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025.. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐకమ త్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు రానున్నాయి.
స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృత పరిచేలా సభ్యుల అర్హత వయసు పెంచనున్నారు. కిశోర బాలికలు, వయో వృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపుతో పాటు గరిష్ట వయసు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంపుదల చేశారు.
మహిళా సంఘాలకు రూ. 21,632 కోట్ల రుణాలు, 2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు, రూ. 110 కోట్లతో 22 జిల్లాల్లో చురుకుగా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించడం కోసం మాదాపూర్ లోనీ శిల్పారామంలో రూ. 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం, మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా రూ. 30 కోట్ల ఆదాయం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో ఇప్పటికే రూ. 634 కోట్ల విలువగల 23,701 పనులు, మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా, 400 మందికి రూ. 40 కోట్ల ప్రమాద బీమా చెల్లింపు, 32 జిల్లాల్లో అందుబాటులోకి 32 మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు, ప్రతి ట్రక్కుపై ఆరు లక్షల సబ్సిడీ, మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు, మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టిసి అద్దె బస్సుల నిర్వహణ పథకాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.