కల్తీ.. కల్తీ.. ఏది ఒరిజనల్లో ఏది డూప్లికేటో..? జర జాగ్రత్త…!!

కల్తీ.. కల్తీ.. ఏది ఒరిజనల్లో ఏది డూప్లికేటో..? జర జాగ్రత్త…!!

ఒక్క హైదరాబాద్ నే కాదు..ఆంధ్ర లో పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల పట్టణ,మండల స్థాయిలో కల్తీ టీ పౌడర్ కలకలం రేపింది.. దారుణాతి దారుణం. ఈ కల్తీ ప్రపంచంలో ఏం కొనగలం..? ఏది తినగలం..?

కారం, ఉప్పు, పప్పు, పసుపూ ఏది వాడాలన్నా భయమే. ఇక నూనెలయితే ఏ కొవ్వు కలిసిందో, వాటిల్లో ఏమేం కలిపారో అస్సలు కనిపెట్టలేం. చివరికి టేస్ట్‌కోసం వేసే మసాలాలు, గార్లిక్‌ జింజర్‌ పేస్టు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి.

ముచ్చటపడి ముక్కలాగిద్దామనుకుంటే నాన్‌వెజ్‌ నాణ్యత కూడా దారుణాతి దారుణం.

అల్లం, వెల్లుల్లి చచ్చులు పుచ్చులు తీసుకొచ్చి, అపరిశుభ్ర వాతావరణంలో చేతులతోనే పిసికేస్తే ఆ పేస్ట్‌నే మనం టేస్ట్‌కోసం వాడుతున్నాం. ఏదో ఒక లేబుల్‌ అంటించేసి ఆ ఛండాలాన్నే ప్యాకింగ్‌ చేసి అంటగడుతున్నారు వ్యాపారులు.

ఓల్డ్‌సిటీలోని చాదర్‌ఘాట్‌ వినాయక్‌నగర్ కాలనీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కుటీర పరిశ్రమలా తయారు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ముందురోజే ఓల్డ్‌సిటీలో టన్నుల కొద్దీ కుళ్లిన మటన్‌ని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుతో వాంతి వచ్చినంత పనవుతుంటే తట్టుకోలేక స్థానికులిచ్చిన సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును మూసీలో పారబోయించారు.

నార్త్‌ బ్యాచ్‌ దిగిపోయింది. జనం ఆరోగ్యాలను గుల్లచేయడమెలాగన్న దానిపై రీసెర్చ్‌ చేస్తోంది.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం కూడా వచ్చిపడుతోంది. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మటన్‌షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. ఏకంగా నాలుగు నెలలనుంచి నిల్వచేసిన 12 క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లకు, పెళ్లిళ్లలాంటి శుభకార్యాలకు ఇలాంటి మాంసాన్ని హోల్‌సేల్‌లో అంటగట్టేస్తున్నారు. దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ, కల్తీ నూనెల దందా ఈమధ్యే బయటపడింది. మలక్ పేట గంజ్ లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టయింది. డ్రమ్ముల్లోని నూనెని వేరే నూనెలతో కలిపి 20 లీటర్ల క్యాన్లలో నింపేస్తున్నారు. వాటినే పేరున్న కంపెనీల బ్రాండ్ల సీల్స్‌తో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పేరున్న కంపెనీల కార్టన్లు, కంపెనీల లేబుళ్లను గుర్తించారు.

కడుపు చించుకుంటే కాళ్లమీద పడేలా ఉందే తప్ప కల్తీలు, నకిలీలు మాత్రం ఆగడంలేదు. ఆ వస్తువూ ఈ వస్తువనే తేడా ఏం లేదు. డబ్బుపోసి రోగాలు కొనితెచ్చుకున్నట్లవుతోంది కస్టమర్ల పరిస్థితి. కఠినశిక్షల భయం ఉంటే తప్ప కల్తీరాయుళ్ల ఆటగట్టించడం అసాధ్యం..!!

Join WhatsApp

Join Now

Leave a Comment