60 ఏళ్ళ పూర్వం ఆనాటి జీవన శైలి….
ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.
కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.
మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.
ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.
కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.
బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ, పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు.
అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.
ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.
అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.
అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.
బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే