తెలంగాణ అసెంబ్లీలో విషపు చెట్ల గురించి ఎందుకింత చర్చ..?
కోనోకార్పస్ చెట్లపై కనీసం పిట్ట కూడా కూర్చోదని, అలాంటి చెట్లను తెలంగాణ వ్యాప్తంగా నాటారని, వాటిని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హరితహారం కార్యక్రమంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 273 కోట్ల మొక్కలను నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పగా.. దీనిపై స్పీకర్ స్పందించారు.
ఈ మొక్కలలో చాలా వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నాయని, అవి పర్యావరణానికి హానికరమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
‘‘ కోనోకార్పస్ చెట్లకు నీళ్లు అవసరం లేదు. ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుని కార్బన్డయాక్సైడ్ వదులుతుంది. ఆ మొక్కపై పిట్ట కూడా కూర్చోదు. అలాంటి చెట్లను తెలంగాణ మొత్తం నాటారు.” అని స్పీకర్ అన్నారు. కోనోకార్పస్ చెట్లను నిర్మూలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు.
అయితే, గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చర్చిస్తోన్న కోనోకార్పస్ చెట్లు ఏంటి? వీటి కథేంటి? ఎందుకు ఈ చెట్లను తీసేయాలని తెలంగాణ స్పీకర్ సూచించారు? వంటి విషయాలను మనం తెలుసుకుందాం
శంఖు రూపంలో( కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్’ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఎంచుకున్నాయి.
భారత్, పాకిస్తాన్, అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్, కమ్యునిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తోంది.
కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది.
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హరిత వనం’ నర్సరీల్లో కోనోకార్పస్‌ను పెంచవద్దని 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేసింది.
నగర సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ ‘జీహెచ్ఎంసీ’ పరిధిలో ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచారు
కోనోకార్పస్ ఎక్కడి నుంచి వచ్చింది?
కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది.
అరబ్, మద్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు.
“ఏపుగా ఒక కోన్ షేప్‌లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్పర్ట్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతే కాకుండా, శ్వాస సంబంధ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణం అవుతుంది” అని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రొఫెసర్ ఈ నరసింహ మూర్తి అప్పట్లో బీబీసీతో చెప్పారు.
తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా అప్పట్లో కోనోకార్పస్‌పై విస్తృత చర్ఛ సాగింది.
మహారాష్ట్రలో పుణె నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కులలో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు అప్పట్లో తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అరబ్ దేశాలు, ఇరాక్, పాకిస్తాన్ అనుభవాలు
అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో కోనోకార్పస్‌ను ‘దమన్’ అని పిలుస్తారు. పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడి నియంత్రిస్తుందని, ఎడారి వాతావరణంలో దుమ్ము, ధూళి, గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటుందని ఆ దేశాలు కోనోకార్పస్‌ను పెద్ద సంఖ్యలో పెంచాయి.
అయితే, కువైట్, ఖతార్, యూఏఈ లాంటి దేశాలు నర్సరీల్లో దీని పెంపకం, దిగుమతులను నియంత్రించాయి.
కాంక్రీట్ వనాల మధ్య వేగంగా హరిత వాతావరణం తీసుకొచ్చేందుకు ఈ మొక్క దోహదపడుతుండటం ఆయా దేశాలు దీన్ని ఆదరించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని ప్రొఫెసర్ నర్సింహ మూర్తి అన్నారు.
”సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. దీంతో, అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లకు నష్టం చేస్తాయి. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి.’’ అని నర్సింహ మూర్తి చెప్పారు.u
వీటి పండ్లు, పూలు ఎందుకూ పనికిరావనీ, ఆఖరికి పక్షులు కూడా దీనిపై గూళ్లు పెట్టవనీ, అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు లేవనీ ఆయన అన్నారు.
‘‘భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించే ఈ చెట్టుకు బదులు స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి, పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని వృక్షశాస్త్ర నిపుణులుగా ప్రభుత్వాలను కోరుతున్నాం.” అని ప్రొఫెసర్ మూర్తి అన్నారు.
ఇరాక్ దేశంలోని ‘మిసాన్ ప్రావిన్స్‌లో కోనోకార్పస్‌తో అక్కడి మౌలిక వసతులకు ఎదురైన పరిస్థితులు, కలిగిన నష్టాలపై ‘యూనివర్సిటీ ఆఫ్ మిసాన్’ 2020లో జరిపిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఒక పరిశోధన పత్రం ప్రచురించింది.
ఈ మొక్క వల్ల స్థానిక నివాస ప్రాంతాల్లోని వాటర్ పైప్ లైన్, డ్రైనేజీలకు నష్టం వాటిల్లినట్టు అందులో పేర్కొన్నారు.
అయితే, ఈ మొక్క పచ్చదనానికి తోడ్పడుతున్నందున వాటి వేర్లు భూగర్భంలో లోతుగా, దూరంగా చొచ్చుకు పోయి నిర్మాణాలకు నష్టం చేయకుండా ఉండేలా రోజు వారిగా నీటిని పట్టాలని, ఈ మొక్కల ఆకుల పెరుగుదలను ప్రూనింగ్ పద్దతిలో నియంత్రించడం వల్ల మొక్కకు అవసరమయ్యే నీటి వినియోగం తగ్గించాలని, నిర్మాణాలకు దూరంగా పెంచాలని ఈ పరిశోధన పత్రంలో సూచనలు చేశారు.
మొక్కలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా..?
వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నట్టుగా మొక్కలు మనుషుల ఆరోగ్యాలను ప్రభావితం చేయగలుగుతాయా అన్న అంశంపై కరీంనగర్‌కు చెందిన శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ ఉడుత చంద్రశేఖర్ అంతకు ముందు బీబీసీతో మాట్లాడారు.
“అన్ని రకాల మొక్కలతో ఇలాంటి అనుభవం ఉండకపోవచ్చు. కొన్ని రకాల మొక్కలు మనుషుల చర్మం, శ్వాస వ్యవస్థలపై ప్రభావితం చూపుతాయన్నది కొన్ని పరిశోధనల్లో రుజువైంది. సాధారణంగా పార్థీనియం, పొద్దుతిరుగుడు, ఉమ్మెత్త, చామంతి, మందార, గులాబీ మొక్కల పుప్పొడి రేణువులు తాకడం వల్ల కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తుంది.
తెలియకుండా వాటి వాసన పీల్చినా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై శ్లేష్మం(మ్యూకస్) పెరిగిపోయి కఫం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’, బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీ అని అంటారు.
కొంత మందిపై కొన్ని రకాల మొక్కలు ప్రభావం చూపుతాయి. ఇదివరకే ఆస్థమా, చర్మ సంబంధ అలర్జీ ఉన్నవారిపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ రకం అలర్జీలకు చికిత్స ఉంది. అయితే ముందుజాగ్రత్త చర్యగా వాటికి దూరంగా ఉండటం మంచిది” అని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు.