సీఎం ప్రజావాణి చొరవతో రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారు వేములపతి దేవి
చిన్నారెడ్డి, దివ్యలతో దేవి భేటీ
హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ వర్క్: సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య చొరవతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములపతి దేవికి రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం ఉత్తర్వులు అందాయి.
మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి వచ్చిన దేవి తన ఉద్యోగ నియామక ఉత్తర్వులను చిన్నారెడ్డి, దివ్య లకు చూపించి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బి. రవికుమార్ విధి నిర్వహణలో 2018 నవంబర్ 17న మృతి చెందారు. అయితే మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి కావడంతో ఆరేళ్లుగా ఆంధ్ర – తెలంగాణ ప్రభుత్వాల మధ్య కారుణ్య నియామక అంశం తేలకుండా పోయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారభించడంతో సమస్యను వివరిస్తూ కొన్ని నెలల క్రితం మృతుడు భార్య దేవి పిటిషన్ ను ఇచ్చారు. ఈ విషయం అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది.
హైదరాబాద్ పోలీస్ శాఖలో ఉద్యోగి కావడంతో తెలంగాణ రాష్ట్రంలోనే మృతుడి భార్య దేవికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దీంతో హైదరాబాద్ కలెక్టర్ A2/165, తేదీ 5-5-2025 ద్వారా నాంపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో చేరిన తర్వాత మంగళవారం ప్రజావాణికి వచ్చి చిన్నారెడ్డి, దివ్యలకు లబ్ధిదారు దేవి తన నియామక ఉత్తర్వులు చూపించారు.
కారుణ్య నియామకం ద్వారా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన ప్రజావాణి బృందానికి వేములపతి దేవి కృతజ్ఞతలు తెలిపారు.