కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై ఢిల్లీలో ప్రెస్ మీట్….పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

తెలంగాణ రాష్ట్రం,ప్రజల ప్రయోజనాలు, న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు తమ పార్టీ మొదటి నుంచి కొట్లాడుతూనే ఉందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీని గతంలో పలుమార్లు కలిసి కోరడం, లేఖలు రాయడం జరిగిందన్నారు.అదేవిధంగా వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత లోకసభ సభ్యులుగా ఉన్నప్పుడు సంబంధిత మంత్రులు,అధికారులను కలిసి డిమాండ్ చేయడం,వినతిపత్రాలు అందజేశారని ఆయన వివరించారు.కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేసీఆర్ 160ఎకరాల భూమిని కూడా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు,గతంలో హామీనిచ్చిన మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా సోమవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరామని చెప్పారు.కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పే వరకు బీఆర్ఎస్ విశ్రమించదని,పార్లమెంట్ లోపల,బయట పోరాడుతుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.వ్యాగన్ రిపేర్ సెంటర్,వచ్చే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలలో 60శాతం స్థానికులకే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో అడుగుపెట్టకుండా అరెస్టులు చేయడాన్ని ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.మోడీ-అదానీ ఫోటోలతో ఉన్న టీ షర్ట్ ధరించి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగుపెట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ,అదే తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ-రేవంత్ రెడ్డి ఫోటోలున్న టీ షర్ట్స్ వేసుకుని వస్తే గేట్ వద్దనే అడ్డుకుని అరెస్టులు చేయడంలో అర్థమేమిటో ప్రజలు గ్రహించారని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment