యువతీ,యువకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..?

సమర శంఖమ్ డిసెంబర్ 3, క్రైమ్:

నవాబుపేట : మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చాకలి అంకిత (18) అనే యువతి, అదే గ్రామానికి చెందిన రెడ్డిపల్లి చందు కుమార్ (20) అనే యువకుడు ఆదివారం వేరువేరు చోట్ల వేరువేరు సమయాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంకిత తన తల్లిదండ్రులు సుజాత,ఆంజనేయులు, తన సోదరుడు పని నిమిత్తం పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం వద్దకు వెళ్లగా..మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే చందు కుమార్ అదే రాత్రి ఊరు బయట చెట్టుకు కరెంట్ వైర్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన అంకిత మహబూబ్ నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా..చందు కుమార్ మహబూబ్ నగర్ లోని వాసవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. వేరువేరు సంఘటనల్లో యువతీ,యువకులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో..వారి ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంకిత ఆత్మహత్యకు పాల్పడిన రోజే చందు కుమార్ ఆత్మహత్యకు పాల్పడడంతో..వారి మధ్య ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యలకు దారితీసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరు కుటుంబాల వారు కూడా తమ పిల్లల మృతికి ఫిర్యాదులలో ఎలాంటి కారణాలు పేర్కొనలేదు. ప్రేమించుకున్న వారిద్దరి మధ్య మనస్పర్థలు నెలకొనడంతో..అంకిత క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల తనకు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో చందు కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువతీ,యువకులు ఆత్మహత్యలకు పాల్పడడంతో..గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఇరువురి అంత్యక్రియలు సోమవారం గ్రామంలో వారి,వారి బంధువులు తమ తమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వారి అంత్యక్రియలు పూర్తయినా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకోకపోవడంతో..ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడానికే ఆ విధంగా ఆ యువతీ,యువకుల కుటుంబాల వారు వ్యవహరించినట్లుగా గ్రామంలో గుసగుసలు వినిపించాయి. యువతి, యువకుల బంధువుల ఫిర్యాదుల మేరకు కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment