శరీరం భేషుగ్గా ఉండాలంటే అది ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే మనసొక్కటే సరిపోదు.. శారీరక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగిపోయింది. ఫలితంగా మన భోజనం ప్లేటులో చాలా చాలా మార్పులొచ్చేశాయి. ఇప్పుడు మనం తినేవన్నీ ఇడ్లీ, చపాతీ, దోశ, పూరీ, బొండాలు కాదు. కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, పీచు పదార్థాలు. ముద్దపప్పు, ఆవకాయ, పులుసు, పచ్చడి స్థానంలో ‘ఆరోగ్యంగా ఉండేందుకు, ఆరోగ్యం పాడైతే, నిద్ర పట్టేందుకు, రక్త హీనత లేకుండా, తలనొప్పి రాకుండా, గుండెపోటు దరిచేరకుండా, క్యాన్సర్ కబళించకుండా అంటూ రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి. మనకు తెలియకుండానే మనం తినే కంచం రూపం మారిపోయింది. అందులో ఉండే పదార్థాలు కూడా!
భోజనం ప్లేటు వంటగది నుండి బయటికి వచ్చేసి చాలా రోజులైంది. తోపుడుబళ్లు, టిఫిన్ స్టాళ్లు, చిన్నా, పెద్ద హోటళ్లల్లో ఆహారం-ఆరోగ్యం పేరుతో పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ఇంట్లో అమ్మ అప్పుడప్పుడు కాసే సగ్గుబియ్యం జావ దగ్గర నుండి వేసవి కాలం తరచూ తాగే రాగి జావ, జొన్న సంకటి, వర్షాకాలం వేడి వేడి సూప్‌లు, శీతాకాలం రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలు, సలాడ్‌లు ఇలా ఎన్నో మార్కెట్లో ఆహారాన్ని అంతెత్తున కూర్చోబెట్టాయి. తిండిలో ఇంత మార్పు ఎప్పటి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది?
1991 నుండి అంటే సరిగ్గా మన భారతదేశంలో సరళీకరణ విధానాలు అమలు జరిగినప్పటి నుండి ఆహారంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పుడు మొదలైన మార్పులు ఈ ఐదు దశాబ్దాల్లో మరింతగా విస్తరించాయి. జనాభా పెరుగుదలతో పాటు ఆహారంలో మార్పులు అనేకసార్లు మారుతూ వచ్చాయి.
కోవిడ్ తరువాత ఆహారం కొత్త కొత్త రూపాలతో మనముందుకు వచ్చింది. ఇప్పుడు చాలామంది క్యాలరీల లెక్కలతో టిఫిన్, భోజనం, డిన్నర్ చేస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే వేడి వేడి ఛారు, కాఫీలకు బదులుగా ఔషధాలు మరిగించిన వేడి నీళ్లు తీసుకుంటున్నారు. ఇక టిఫిన్ ప్లేట్లు పిల్లలకు ఒకరకం, పెద్దలకు మరో రకం. అనారోగ్యంగా ఉన్నవాళ్లకి ఇంకో రకం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాల పేరుతో మొలకెత్తిన గింజలు ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు.. ఓట్స్, జావలు, డ్రైఫ్రూట్స్, రంగురంగుల పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పచ్చివి, సగం ఉడకబెట్టినవి, వేళ్లు, కాడలు, ఆకులు, పూలు, కాయలు, పళ్ల రసాలు, కూరగాయ జ్యూస్‌లు.. ఈ జాబితా చాలా పెద్దదే.
యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఏదైనా ఆహారాన్ని 6 గ్రూపులుగా విభజించవచ్చు – ధాన్యం (బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, ఇతర తృణధాన్యాలు), పాడి, గుడ్లు (గుడ్లు, పాలు, జంతువుల కొవ్వులు), మొక్కల ఉత్పత్తులు (కూరగాయలు, పండ్లు, పిండి మూలాలు), మాంసం, చక్కెర, కొవ్వు (చక్కెర, స్వీటెనర్లు, కూరగాయల నూనెలు, నూనె పంటలు, చక్కెర పంటలు), ఇతరములు (పప్పులు, మద్య పానీయాలు).
2015లో జాతీయ ఫుడ్ ఆర్గనైజేషన్ ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం.. 1961లో ఒక భారతీయ సగటు కుటుంబ సభ్యుడు రోజుకు 2,010 కేలరీల ఆహారాన్ని వినియోగించేవారు. 2011 నాటికి అది 2,458 కేలరీలకి చేరింది. క్రమ క్రమంగా మన ధాన్యం వినియోగం 63 శాతం నుండి 57 శాతానికి తగ్గింది. ఆ స్థానంలో పాడి, గుడ్లు, మొక్కల ఉత్పత్తుల వినియోగం రెండింతలు పెరిగింది. చక్కెర, కొవ్వు పదార్థాల వినియోగం కూడా 3 శాతం పెరిగింది. అయితే మాంసం వినియోగంలో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు. సగటు మనిషి ఆహారం కోసం వినియోగించే సొమ్ములో ధాన్య ఉత్పత్తులకు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నారు. మిగిలిన ఉత్పత్తులకి మాత్రం పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు.
బ్రేక్‌ఫాస్ట్.. స్నాక్స్..
ఉదయం టిఫిన్ ప్లేట్లో మార్పులు వచ్చినట్లుగానే స్నాక్స్ కూడా వేగంగా మారిపోయాయి. బంగాళదుంప చిప్స్, సమోసా, పకోడా, బజ్జీ, బొండా వంటి వాటితో మొదలై ఇప్పుడు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు గల స్నాక్స్ వచ్చాయి. పాశ్యాత్య ఆహారపు అలవాట్లు భారత కుటుంబాలను తాకి చాలా కాలం అయ్యింది.
భోజనం ప్లేటు.. ఇక భోజనం ప్లేటు సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఉదయం, సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకుంటే మధ్యాహ్నం భోజనంలో మాత్రం సంపూర్ణ పోషకాలు ఉండాల్సిందేనన్న నియమం వచ్చేసింది. ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న కూర, పీచు పదార్థాలు పుష్కలంగా లభించే వడ, బజ్జీ, బియ్యంతో సమానమైన కార్బొహైడ్రేట్లు అంటూ గోధుమలు, జొన్న, కొర్రలు, సామలు, అరెకెలు, క్వినోవా.. ఇలా రకరకాల చిరుధాన్యాలతో చేసిన రవ్వ, పిండితో చేసిన పదార్థాలు, చివర్లో పెరుగు, పండు, స్వీట్‌తో భోజనం ముగిస్తున్నారు. ఇందులో ఆరోగ్యం కోసం తినే ప్లేటు, అనారోగ్యంగా ఉన్న వారి కోసం మరో ప్లేటు, పిల్లల లంచ్ క్యారేజీలో ఇంకో రకం ఉంటున్నాయి.
డిన్నర్.. డిన్నర్‌పై ఇప్పుడు భారతీయులకు విపరీతమైన శ్రద్ధ పెరిగిపోయింది. రాత్రి వేళ మితాహారం తినడం మంచిదన్న అలవాటు బాగా వంటబట్టించుకున్నారు. భోజనం బదులుగా రకరకాల టిఫిన్లు డిన్నర్‌ని ఆక్రమించాయి. ఇప్పుడు బయట టిఫిన్ స్టాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఇదే కారణం. అంతెందుకు విందులు, వినోదాల్లో కూడా టిఫిన్ చేసేవారి కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టేస్తున్నారు.
సమయం కూడా…
తినే తిండే కాదు, అది తీసుకునే సమయం కూడా ఇప్పుడు బాగా మారిపోయింది. నిర్దిష్ట సమయంలో తింటేనే తిన్నది వంటబడుతుందని, రోగాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఒకప్పటిలా హోటళ్లల్లో అన్ని వేళలా భోజనం అందుబాటులో ఉండడం లేదు. సమయం దాటితే దొరకడం కష్టమన్న పరిస్థితి వచ్చేసింది.
ఈ మార్పు ఎక్కడికి దారితీస్తోంది.. మన దేశంలో రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఎక్కువ. చాలీచాలనీ జీతాలతో బతుకులు వెల్లదీసే జనాభా కోకొల్లలు. ఉండడానికి ఇల్లు లేని వారి జనాభా కోట్లలో వుంటుంది. తిన్నా, తినకపోయినా పిల్లల చదువుల కోసం ఖర్చు చేసేవారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కానీ మారిన ఈ ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పేరుతో జరుగుతున్న పెద్ద వ్యాపారంగా రూపాంతరం చెందింది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆస్పత్రి పాలవ్వకుండా ఉండాలంటే ఈమాత్రం ఖర్చు చేయాల్సిందేనన్న దృష్టికి సగటు మనిషి వచ్చేశాడు. ఆరోగ్యం అందరికీ కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే బతుకు బండి సాఫీగా సాగుతుంది. అయితే ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించడం వల్లే ఇప్పుడు మన భారతదేశంలో తిండి ఖర్చు ఎక్కువైపోయింది. ఇది ఇలానే కొనసాగితే సాధారణ ప్రజల మనుగడ మున్ముందు మరింత కష్టం.. నష్టం..!