శాశ్వత ప్రాతిపదికన 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి: ఏపీ హై కోర్ట్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయండి.
ఆన్లైన్ విచారణకు హాజరైన సీఎస్.
అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిం చింది.
తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్ సీనియర్ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయానంద్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్ ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం ఏపీపీల కేడర్ స్ట్రెంత్ 204 గా ఉందని, దీనిని 209 కి పెంచనున్నామని విజయానంద్ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.