రంగంపల్లి: బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అరుణ శ్రీ
పెద్దపల్లి, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- ప్రభుత్వ గురుకులాలలో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు.
మంగళవారం పెద్దపల్లిలోని రంగంపల్లిలో ఉన్న మహాత్మ జ్యోతిభా ఫూలే బీసి బాలికల గురుకులాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తనిఖీ చేశారు.
బాలికల గురుకులంలో డార్మెంటరీ, క్లాస్ రూమ్, పారిశుధ్య నిర్వహణ, భోజన హాల్, వంట గది, వంట సామాగ్రి భద్ర పర్చే ప్రదేశాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లలతో మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ , విద్య బోధన వంటి వివరాలను ఆరా తీశారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ మాట్లాడుతూ.. గురుకులంలో విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. హాస్టల్ కు విద్యార్థుల కోసం వచ్చే గుడ్లు కూరగాయలు, పండ్లు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. 2 రోజుల మించి గుడ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గుడ్లు విద్యార్థులకు అందించాలని అన్నారు.
బీసి బాలికల గురుకులంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బాలికలకు ప్రభుత్వం నిర్దేశించిన కామన్ మెను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10వ తరగతి పరీక్షల దృష్ట్యా స్టడీ అవర్స్ నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు విద్యార్థినులు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు. గురుకులంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి పనులు త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ మణీ దీప్తి, ఉపాధ్యాయినులు విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.