ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఊరట..

---Advertisement---

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్‌ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్‌ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్‌ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్‌ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ప్రొసీజర్ పాటించలేదని అనడం సరైనది కాదని అన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని అన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్‌ దీనికి వర్తించదని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment