కాలుష్య రహిత హైదరాబాద్.. ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు పలు కీలక చర్యలను ప్రకటించారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో జరిగిన ప్రభుత్వ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో నీరు, గాలి, భూమి కాలుష్యమైందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చేయాలని పేర్కొన్నారు.
పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) కు బయట, రీజనల్ రింగ్ రోడ్ (RRR) కు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూములను గుర్తించి, పరిశ్రమలను అక్కడ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇవి విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌ను ప్రపంచంలోని ప్రముఖ నగరాల సరసన నిలపెట్టేందుకు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్‌తో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇటువంటి చర్యల ద్వారా, హైదరాబాద్‌ను కాలుష్యరహిత, సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు