ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరంతో పాటే.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలతో పూర్తవుతుండడంతో.. కొత్త సీఎస్, డీజీపీ కోసం కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం ఏపీ సీఎం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..? వినిపిస్తున్న పేర్లు ఏంటి..? అన్నదీ ఆసక్తికరంగా మారింది.
నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేస్తున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్లేస్‌కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో విజయానంద్, సాయి ప్రసాద్, ఆర్పీ సిసోడియా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పదవీకాలం ఆధారంగా ఎవరిని నియమించాలనే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చంద్రబాబు సీఎం అయ్యాక ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆరేడు నెలల్లో ప్రభుత్వం అప్పగించిన కీలక కేసులను సమర్థంగా తిరుమలరావు డీల్ చేశారు. అయితే డీజీపీ పదవీకాలం పొడిగించిన సందర్భం ఇంతవరకూ లేకపోవడంతో.. తిరుమలరావు స్థానంలో కొత్త డీజీపీ నియామకం తప్పకపోవచ్చంటున్నాయి ప్రభుత్వ వర్గాలు
ఇదిలావుంటే, 1990 ఏపీ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్, అంజనీ సిన్హాలు కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల వారికి అవకాశం లేనట్టే. దీంతో 1992 ఏపీ కేడర్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకే మళ్లీ అవకాశం దక్కవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఆయనకే అవకాశమిస్తారా? లేక ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకుంది.