అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు ఉండాలి: జిల్లా కలెక్టర్ అంబేద్కర్
విజయనగరం, మార్చి 05 , సమర శంఖం ప్రతినిధి:- విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు తప్పక ఉండాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి టాయిలెట్ లేని , అదే విధంగా విద్యుత్ సరఫరా లేని భవనాల ఖఛ్చితమైన జాబితాను వెంటనే అందించాలని ఆదేశించారు. వాటికి వెంటనే విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలనీ విద్యుత్ , విద్యా శాఖల అధికారులకు ఆదేశించారు.
బుధవారం కలేక్టరేర్ ఆడిటోరియం లో ఐ.సి.డి.ఎస్ శాఖ అధికారులతో బరువు తక్కువ ఉన్న పిల్లలు, బరువుకు తగ్గ ఎత్తు లేని వారి వివరాల పై, టీనేజ్ ప్రేగ్నన్సి తదితర అంశాల పై కలెక్టర్ సమీక్షించారు. ప్రతి నెల బరువులను నమోదు చేసేటప్పుడు ఖచ్చితమైన బరువులను నమోదు చేయాలనీ, అంచనాలను బట్టి వేయరాదని తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సూపర్వైజర్ తనిఖీ చేసి అంగన్వాడీ కార్యకర్త, ఆయా, ఆశ, ఏ.ఎన్.ఎం లను దగ్గర పెట్టుకొని ఖచ్చితమైన బరువులను, ఎత్తులను నమోదు చేయాలనీ , అందరి రిజిస్టర్లలో ఒకే సమాచారం ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం 15 రోజుల్లో పూర్తి కావాలని, ఆ తర్వాత తప్పులు కనపడితే సంబంధిత కార్యకర్త, సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశం లో ఐ.సి.డి.ఎస్ ఇంచార్జ్ పి.డి ప్రసన్న , డి.ఎం హెచ్ ఓ డా.జీవన రాణి, విద్యుత్ శాఖ ఎస్.ఈ లక్ష్మణ రావు, డి .పి.ఓ వెంకటేశ్వర రావు, సీడీపీఓ లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.