పారదర్శకంగా గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ..జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
— డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ…
— పరీక్ష సమయం ముగిసే వరకు హాల్ విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు….
— గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై సి.ఎస్., అబ్జర్వర్ లు, సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర…
ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 13 సమర శంఖమ్ :-
జిల్లాలో పారదర్శకంగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్ లలో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఖమ్మం జిల్లాలో 28 వేల 101 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మొత్తం 85 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని అన్నారు. పరీక్ష రోజు ఉదయం ఓఎంఆర్ షీట్, ప్రశ్నా పత్రాలు వచ్చిన తర్వాత వాటిని కెమెరా సమక్షంలో తెరవాలని, ఓఎంఆర్ షీట్, ప్రశ్నాపత్రాలు చెక్ చేసుకోవాలని అన్నారు. ప్రతి రూమ్ లో 24 మంది అభ్యర్థులు ఉంటారని, ప్రతి రూమ్ కు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను ఆ రూమ్ లకు సకాలంలో అందజేయాలని, ప్రశ్నాపత్రాలను పరీక్ష హాల్లో మాత్రమే ఓపెన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు రిసివ్ చేసుకొని ప్రతి హాల్ కు అందించేందుకు ఫ్లోర్ ఇంచార్జి లను నియమించామని అన్నారు.ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ లను పబ్లిక్ సర్వీస్ కమీషన్ తయారు చేసిందని, పరీక్షలకు అభ్యర్థి రాకపోయినా సంబంధిత అభ్యర్థి బెంచ్ పై ఓఎంఆర్ షీట్ పెట్టాలని అన్నారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల ముందు ప్రశ్నాపత్రాలు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి అరగంటకు బెల్ మోగెలా చీఫ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని అన్నారు.పరీక్ష హాల్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు ప్రవేశించడానికి వీలు లేదని అన్నారు. పరీక్షా కేంద్రం కాంపౌండ్ వాల్ దగ్గర కిటికీలు, చెట్లు ఏవైనా ఉన్నాయా పరిశీలించాలని , ఎట్టి పరిస్థితులలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయంలో ఎవరు బయటకి వెళ్లడానికి వీలు లేదని అన్నారు.అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో చెక్ చేసేందుకు అవసరమైన స్టాఫ్ ఏర్పాటు చేయాలని, మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు ప్రైవసీ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రంలో హల్ నెంబర్లకు మార్గం తెలిసేలా డైరెక్షన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రశ్న పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఒకరోజు ముందు పరీక్ష కేంద్రం పరిసరాలను చీఫ్ ఇన్విజిలేటర్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల గేటు వద్ద ఒక గడియారం ఏర్పాటు చేయాలని అన్నారు.పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8-30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1-30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9-30 గంటలకు, మధ్యాహ్నం 2-30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఒకరోజు ముందు వెళ్లి చెక్ చేసేలా ప్రచారం చేయాలని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, సెల్ఫోన్ పెన్ డ్రైవ్, బ్లూ టూత్ డివైసెస్, జువెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని, చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని షూస్ వేసుకోవద్దని, అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫై చేయాలని అన్నారు.ఈ సమావేశంలో రీజినల్ కో ఆర్డినేటర్ లు డా. వి. చిన్నయ్య, డా. జి. రాజ్ కుమార్, డిఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, పరీక్షా సి.ఎస్. లు, అబ్జర్వర్లు, తదితరులు పాల్గొన్నారు.