అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది. జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం (National Farmers Day) భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు.
దీనిని ‘కిసాన్ దివస్’ అని కూడా అంటారు. భారతదేశ ఐదవ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల ఆకలి బాధను తీర్చే దైవాలు రైతులు. నేల తల్లిని నమ్ముకొని, పలు రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు మన వ్యవసాయ దారులు. ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే. కానీ.. ఇప్పుడు పది మందికీ అన్నం పెట్టే రైతన్నలు కరువయ్యారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా రైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. రైతులు కావాలని కోరింది ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకు ఇవ్వటం లేదో రైతులకు తెలియదు. వారు అడిగింది సరైంది కాదా అంటే కాదని ఎవ్వరూ అనలేరు.
రైతులపై కూడా కార్పొరేట్ ల ప్రభావం పడింది. అందుకే కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు రైతుల భూములను సైతం లాక్కుంటున్నాయి తప్ప వారికి కావాల్సిన సౌకర్యాలు కలుగ జేయడంలో వెనుకడుగు వేస్తున్నాయి. గత ఏడాది రైతులు తమ సమస్యల కోసం దేశ రాజధానికి బయలు దేరారు. వారిని అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రాకుండా అడ్డుకున్నది. ప్రస్తుతం కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వరకు రావాలని, వారి సమస్యలు చెప్పుకోవాలని బయలు దేరారు. ఎక్కడికక్కడ వారిపై పోలీసు లాఠీలు నాట్యం చేస్తున్నాయే తప్ప వారి సమస్య ఏమిటి? వారు అడుగుతున్నది ఎంత వరకు సమంజసం? వారి కోర్కెలు తీర్చొచ్చా? లేదా? అనే అంశాలు చర్చించేందుకైనా రైతు నాయకులతో ప్రభుత్వం మాట్లాడొచ్చు. కానీ అవేవీ జరగలేదు. ఇదీ నేటి ప్రభుత్వం తీరు.
మనది ప్రాధమికంగా వ్యవసాయ దేశం. ఇందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రాను రాను వ్యవసాయానికి యువత దూరం అవుతున్నారు. ఫలితంగా వలసలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సుస్థిర ఆహార భద్రత, ఆధునిక వ్యవసాయ పద్దతిలో స్థిరమైన వ్యవసాయాన్ని నిర్మించడం అనే థీమ్ తో జాతీయ వ్యవసాయ దినోత్సవం జరుపుతున్నారు. దేశంలొ 140 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 18 కోట్ల మంది రైతులు ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నా దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి మించి లేరని రైతు నాయకులు చెబుతున్నారు. ఇంత తక్కువ మంది ఉన్న ఈ సెక్టారును మరింతగా ప్రోత్సహించి దేశానికి కావాల్సిన ఆహారం వీరి ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఆహార భద్రత పేరుతో విదేశాలపై ఆధార పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారత దేశం నుంచి ఎన్నో దేశాలకు కావాల్సిన ఆహార ధాన్యాలు పంపిస్తున్నాం. ప్రపంచ దేశాలలో ఏ దేశానికీ లేని వ్యవసాయ అవకాశాలు భారత దేశానికి ఉన్నాయి.
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమిందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విడిపించి వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనంద పడింది. అయితే ఆయన పార్లమెంట్ ను ఎదుర్కోలేక తాత్కాలిక ప్రధానిగానే 1980లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని కిసాన్ దివస్ గా ప్రకటించింది.
పంటలు పండించడానికి వారు పడే శ్రమకు గుర్తింపు లేక, చేసిన అప్పులు తీర్చలేక అత్మ హత్యలు చేసుకుంటున్న రైతన్నను కాపాడేందుకు మనమందరం నడుం బిగించాలి. రైతులకు సీలింగ్, మిగులు భూములని పంపిణీ చేయడం, వ్యవసాయ భూములను, వేరే అవసరాలకు వినియోగించకుండా ఉండటం, పంటల బీమాను సమర్ధవంతంగా అమలు చేయడం, పండిన పంటలకు మంచి మద్దతు ధర ఉండేట్లు చూడటం, రైతులకు వడ్డీ భారం తగ్గించడం వంటి స్వామి నాధన్ కమిషన్ సిఫార్సుల అమలుతోనే అన్నదాతలను ఆదుకోవడం సాధ్యం అవుతుంది.
ఈరోజు ప్రాముఖ్యం
రైతుల కృషిని, దేశ ఆర్థిక వ్యవస్థకు వారు చేస్తున్న సేవలను గౌరవించడం.
వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను తెలియజేయడం.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం, వాటి పరిష్కార మార్గాలను కనుక్కోవడం.
ఈ రోజున ప్రభుత్వాలు, వివిధ సంస్థలు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వ్యవసాయరంగంలో విశేష కృషి చేసిన రైతులను సన్మానిస్తారు. కాబట్టి జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం అనేది మన దేశ రైతులందరికీ ఒక ప్రత్యేకమైన రోజు ప్రభుత్వం, సమాజం రైతుల పట్ల సరైన వైఖరిని కనబరచకుండా కేవలం వేడుకలు జరుపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. రైతు దినోత్సవం జరుపుకోవాలా? వద్దా? అనే ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది పరిస్థితులు, సందర్భం, మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది.
రైతు దినోత్సవాన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టడానికి, వాటిని పరిష్కరించడానికి కృషి చేయడానికి, వారిని గౌరవించడానికి, ప్రోత్సహించడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైతు దినోత్సవం కేవలం వేడుక కాదు, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని గుర్తు చేసే రోజు“జై కిసాన్” అనే నినాదం కేవలం ఒక పదం కాదు, అది రైతుల పట్ల మన గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తుంది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.
రుణ భారం…
రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం రుణ మాఫీ పథకాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటివి ప్రవేశపెట్టింది. కానీ, ఇంకా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరుగుతోంది. దీనికి పంటల బీమా పథకం ఉన్నప్పటికీ, దానిని మరింత అందుబాటులోకి తీసుకురావాలి. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించడం లేదు. దీనికి ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను మెరుగు పరచాలి. చాలా ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేవు. దీనికి ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడం, ఉన్న వాటిని అభివృద్ధి చేయడం చేయాలి. చాలా మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన లేదు. దీనికి ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే, ఈ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.
కాబట్టి జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం పూర్తిగా నెరవేర లేదు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభుత్వం, సమాజం, రైతులు అందరూ కలిసి కృషి చేస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. ముఖ్యంగా రైతుల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు కనుగొనడం చాలా ముఖ్యం. అప్పుడే జాతీయ రైతు దినోత్సవ నిజమైన లక్ష్యం నెరవేరుతుంది._*