సుల్తానాబాద్: బ్యాటరీల దొంగతనాలతో అడ్డంగా దొరికిన మాజీ నేరస్తులు
సుల్తానాబాద్, మార్చి 09, సమర శంఖం ప్రతినిధి:-దొంగతనాలని వృత్తిగా ఎంచుకొని అనేకమార్లు జైలుకు పోయిన జల్సాల మోజు తీరక తిరిగి దొంగతనాలకు పాల్పడి, అడ్డంగా దొరికిన బ్యాటరీల దొంగలు.
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ లో ఈ నెల 3 న లారీ లకు సంబంధించిన 22 బ్యాటరీలను దొంగతనం చేసిన దొంగలను సుల్తానాబాద్ పోలీసులు శాఖ చక్యంగా పట్టుకున్నట్లు ఎస్ శ్రావణ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ గాంధీనగర్ కు చెందిన మోటం శ్రీను ( 29 ) స్థానికంగా ఖాళీ బీరు సీసాలు ఏరుకొని, విక్రయిస్తూ జీవించేవాడు. బీరు సీసాలు విక్రయించగా వచ్చిన డబ్బులు తన అవసరాలకు జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేసి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అదే దురుద్దేశంతో 2019 సంవత్సరంలో వెల్గటూర్ మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో ఓ మొబైల్ షాప్ లో షెటర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. వెల్గటూర్ పోలీసులు శ్రీను ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి బెయిల్ పై వచ్చిన శ్రీను మళ్లీ బీరు సీసాలు వ్యాపారం చేస్తూ, 2021 సంవత్సరంలో ఇందారం శివారులో జైపూర్ మండలంలో ఓ హార్డ్వేర్ షాపులో సుమారు 5 టన్నుల ఇనుము, సీసీటీవీ మానిటర్ డివిఆర్ ను దొంగలించాడు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారని తెలిపారు.
తిరిగి జైలు నుండి వచ్చిన మోటం శీను తన సమీప బంధువు అయినా తూర్పాటి మహేష్ ( 29) గణేష్ నగర్, అరుణక్క నగర్ శ్రీరాంపూర్ ( మంచిర్యాల జిల్లా ) లో మేస్త్రి పని చేస్తూ జీవించేవాడని, మోటం శ్రీనుతో కలిసి ఈనెల 03 న శీను మారుతి జెన్ కారులో కరీంనగర్ కు వెళ్లి తమ పనులు ముగించుకొని తిరిగి రాత్రి 11:30 గంటల సమయంలో మంచిర్యాలకు వెళుతున్నారు. మార్గమధ్యలో శాస్త్రి నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద లారీలు నిలిపి ఉండడం చూసి దాదాపు రాత్రి 11:30 గంటల సమయంలో 22 లారీల బ్యాటరీలను చోరీకి పాల్పడి, తమ కారులో నస్పూర్ కు తరలించి భద్రపరచారని, తిరిగి నేడు వాటిని విక్రయించేందుకు కరీంనగర్ తరలిస్తున్నారు. సుల్తానాబాద్ చెరువు కట్ట సమీపాన పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా, అనుమానస్పదంగా కనిపించారు.
తనిఖీలలో భాగంగా లారీలకు సంబంధించిన 22 బ్యాటరీలు కారులో కనిపించడంతో, నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
లారీ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.