భారత్ సహా మయన్మార్‌లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు

భారత్ సహా మయన్మార్‌లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు

భారత్, మయన్మార్, తజకిస్తాన్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అర గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలు దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల్లోనూ వచ్చాయి. అయితే, ఎలాంటి ప్రాణ లేదా తీవ్రమైన ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9:18 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమికి కేవలం 5 కి.మీ లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం 31.49°ఎన్ అక్షాంశం, 76.94°ఇ రేఖాంశంలో ఉన్నట్టు వెల్లడించింది ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.

మయన్మార్‌లో మరోసారి భూకంపం

అదే సమయంలో మయన్మార్ మధ్య ప్రాంతం మైక్తిలా వద్ద 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత మార్చి 28న 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత వచ్చిన ఆఫ్టర్‌షాక్‌గా భావిస్తున్నారు. అప్పటి భూకంపం 3,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. తాజాగా సంభవించిన ఈ ప్రకంపన వల్ల కొత్తగా ఎలాంటి నష్టం లేదా మృతులు సంభవించలేదని అధికారులు తెలిపారు.

గత రెండు వారాలుగా మయన్మార్ ప్రజలకు కంటిమీద కునుకు కరవయ్యింది. మార్చి 28 నుంచి ఇప్పటి వరకూ మయన్మార్ పరిసర ప్రాంతాల్లో 468కిపైగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు భూకంప కేంద్రాల్లో రికార్డయ్యింది. శుక్రవారం కూడా రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

తజకిస్థాన్‌లో రెండు భూకంపాలు

తజకిస్థాన్‌లో ఒక గంటలోపే రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:54 గంటల సమయంలో మొదటి భూకంపం 6.1 తీవ్రతతో సంభవించింది. ఇది భూమికి 10 కిమీ లోతులో, 38.86°ఎన్ అక్షాంశం, 70.61°ఇ రేఖాంశం మధ్యలో ఉంది. రెండో భూకంపం ఉదయం 10:36 గంటల సమయంలో 3.9 తీవ్రతతో, దాదాపు అదే లోతులో 39.02°ఎన్ అక్షాంశం, 70.40°ఇ రేఖాంశంలో నమోదైంది. ఇప్పటివరకు ఈ భూకంపాల వల్ల ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment