ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు

ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు

రాష్ట్రంలో రానున్న ఐదేళ్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన‌ బడ్జెట్ లో ప్రభుత్వ విద్యారంగానికి ఊతమిచ్చే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలోని 44 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా స్థానిక సంస్థలపై భారం తగ్గడమేగాక ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణంతో బోధన చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మెరుగైన ఫలితాల సాధనకు ఊతమిస్తుంది. సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం 2025-26 విద్యాసంవత్సరం నుంచే ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకం కింద రూ.15 వేల చొప్పున అందజేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు, బూట్లు, పుస్తకాలు… డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందజేయనున్నారు. పాఠశాల విద్యకు గత ఏడాది బడ్జెట్ లో జగన్‌ ప్రభుత్వం రూ. 29,909 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం రూ. 31,805 కోట్లు కేటాయించింది. రిజల్ట్‌ ఓరియంటెడ్ విద్యావ్యవస్థపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీపై పాఠ్యాంశాలు తీసుకురావడానికి సర్కారు చర్యలు చేపడుతోంది.ఇక ఉన్నత విద్యలో ఇన్నోవేషన్, రీసెర్చికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేసి, ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో స్టార్టప్ లకు సహకారం అందిస్తారు. రాష్ట్రంలోని ఐదు జోనల్ కేంద్రాలను దీంతో అనుసంధానిస్తారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో నైపుణ్యాభివృద్ధికి ఇన్నోవేషన్ హబ్ దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్-100 యూనివర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలు స్థానం పొందేలా చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, పరిశోధన, పాలిటెక్నిక్ లో క్రెడిట్ ఆధారిత వ్యవస్థ, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుతో ఏపీ విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తయారుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా బడ్జెట్ లో ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించడమేగాక నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలకు మరో రూ.1228 కోట్లు కేటాయించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలలో స్కిల్ హబ్ లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద ప్రత్యేకించి బీసీ విద్యార్థుల కోసం 4 కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను బడ్జెట్ లో ప్రతిపాదించారు. మొత్తంగా మంత్రి నారా లోకేశ్‌ చొరవతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు మహర్దశ పట్టబోతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment