బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఈ ఇళ్లకు ఏమైనా నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నవా?’’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఎలా ఇవ్వరో తామూ చూస్తామన్నారు. గృహజ్యోతి, అంత్యోదయ పథకాలకు దీన్ దయాళ్ పేరు ఎలా పెట్టారని నిలదీశారు. ఆయన ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా అన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.పది నెలల కాలంలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో రూ. 37 వేల కోట్లు వసూలు చేసిందని, అందులో తెలంగాణకు ఇచ్చింది ఎంతని ప్రశ్నించారు. దివంగత మాజీ ప్రధాని వాజపేయి.. ఇందిరమ్మను కాళీమాతతో పోల్చారని గుర్తు చేశారు. ఆమె పట్ల అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండి రాష్ట్రానికి ఒక్క రూపాయన్నా అదనంగా తీసుకువచ్చారా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కారక్రరమాలను కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని, కడుపు మంట తగ్గించుకునేందుకు ఆయనకు ఈనో ప్యాకెట్లు పంపిస్తానని ఎద్దేవా చేశారు.
బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? : మంత్రి పొన్నం ప్రభాకర్
Published On: January 27, 2025 2:11 pm
