అంతర్ జిల్లా దొంగ అరెస్టు.. రూ.11 లక్షల విలువైన నగలు స్వాధీనం
అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి బుధవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం…. నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్ (28) ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ లో కూలి పని చేస్తూ నివసిస్తున్నాడు. అక్కడ తనకు పరిచయమైన వ్యక్తి ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు వెళ్ళగా అతను దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడు. గుల్బర్గా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన లక్ష్మణ్ కూలి పని చేస్తూ నే జూదం, మద్యం వ్యసనాలకు బానిస అయ్యాడు. వ్యసనాలకు అవసరమైన డబ్బుల కోసం లక్ష్మణ్ దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒంటరిగా హైదరాబాద్ నుంచి బస్సులో వివిధ గ్రామాలకు వెళ్లి తాళం వేసిన ఇండ్లను గుర్తించి, సమయం చూసుకొని తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించేవాడు. రోడ్లపై తాళం లేకుండా పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను దొంగిలించి వాటిపై ప్రయాణిస్తూ మరికొన్ని దొంగతనాలు చేశాడు.
దొంగతనానికి వాడిన మోటార్ సైకిల్ ను ఎక్కడో చోట వదిలేసి లాడ్జిలలో ఉంటూ దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు. నిందితుడు ఇప్పటివరకు 40 దొంగతనాలు చేయగా 28 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. 12 కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లిన నిండితుడు డిసెంబర్ 2024లో బెయిల్ పై బయటకు వచ్చాడు. బెయిల్ పై వచ్చిన నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా మల్లాపూర్ మండలంలోని సిర్ పూర్ లో, ముత్యంపేట్ లో, మెట్ పల్లి పట్టణంలో, మేడిపల్లి మండలం దమ్మనపేటలో దొంగతనం చేశాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ శివారులో మల్లాపూర్ ఎస్ఐ రాజు మంగళవారం నిందితున్ని పట్టు ఉన్నారు. నిందితుడైన లక్ష్మణ్ నుంచి రూ.11 లక్షల విలువైన 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని, మల్లాపూర్ ఎస్సై రాజును, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి రాములు అభినందించారు.