ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యు.వి.కా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమానికి తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవాలి:

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. వీటితోపాటు స్పేస్, సైన్సు క్లబ్లలో ఉంటే 5 శాతం వెయిటేజీ ఇస్తారు. సైన్సు క్లబ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్ వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉంటే 10 శాతం వెయిటేజీ, ఎన్సీసీ స్కౌట్స్, గైడ్సుగా ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం, పట్టణ ప్రాంతాల వారికి 5 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.

అన్ని ఉచితమే..:

యువికా కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు ఇస్రో అన్ని వసతులు సమకూరుస్తుంది. విద్యార్థులకు ప్రయాణం, భోజన వసతి ఉచితంగా అందిస్తుంది. ఈ ఏడాది మే నెలలో 14 రోజులపాటు ఇస్రో అంతరిక్ష కేంద్రాలకు తీసుకెళుతుంది. అక్కడ సైన్సుకు సంబంధించిన విశేషాలు, వింతలు తెలియజేయడంతో పాటు రాకెట్ ప్రయోగాలు వాటి పనితీరుపై అవగాహన కల్పించనున్నారు.

ఈనెల 23 ఆఖరి గడవు:

తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈనెల 23వ తేదీలోగా www.isro.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇస్రో యువికా విభాగం విడుదల చేస్తుంది. మే 18 నుంచి విద్యార్థులను విడతల వారీగా ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమం నిర్వహించి 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా బహుమతులు, ప్రశాంసా పత్రాలు అందివ్వనున్నారు.

యువికా నిర్వహించనున్న ప్రాంతాలు:

సూళ్లూరుపేట(ఏపీ), హైదరాబాద్ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), డెహ్రడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), షిల్లాంగ్ (మేఘాలయ), అహ్మదాబాద్ (గుజరాత్).

Join WhatsApp

Join Now

Leave a Comment