కోనేరు దారెటు..? కోనప్పకు కోపమొచ్చింది
రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూరు (టి) నియోజక వర్గానిదే ఎప్పుడు ఏది జరిగినా రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాజకీయ పరంగా ఎప్పుడూ సైలెంట్గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు దారి తీస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విబేధాలు బయటపెట్టినట్లయ్యిందని పలువురు చెబుతున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకోవడంతో కోనేరు కోనప్ప మండిపడుతున్నారు. తాను చెప్పిన పనులతో పాటు, గతంలో నియోజకవర్గానికి తాను తీసుకు వచ్చిన అభివృద్ధి పనులు సైతం రద్దు చేస్తుండటం ఆయన కోపానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. దీంతో ఏం చేయాలనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు శుక్రవారం ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత బీఎస్పీ పంచన చేరి, ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అటు నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీలోనే ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు.
బ్రిడ్జి, అభివృద్ధి పనుల రద్దుపై ఆగ్రహం..
ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం ఇక్కడ రాజకీయంగా పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు, దండే విఠల్ మధ్య ప్రచ్ఛన యుద్ధం సాగుతోంది. నిన్నా మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోనేరు కోనప్ప, ఆయన అల్లుడు రావి శ్రీనివాస్ కలిసిపోయినా దండే విఠల్ రూపంలో కోనప్పకి కాంగ్రెస్లో అడ్డంకిగా మారారు. కోనప్ప రాజకీయంగా ముందుకు సాగాలని చూసినా దండే విఠల్కు పదవి ఉండటం, కోనప్పకి అలాంటిదేమీ లేకపోవడంతో ఇబ్బంది కరంగా మారింది. ఈ సమయంలో అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. ఇక ఇదంతా ఒక్కెత్తు కాగా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో విడుదల చేయించిన నిధులు, అభివృద్ధి పనులను సైతం రద్దు చేయించడం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లయింది.
అధికార పార్టీపై ఆగ్రహం..
వీటన్నంటిని గమనించిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే శుక్రవారం రాత్రి విర్ధండిలో జరిగిన సభలో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం లోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా వెంట ఉంటూ నన్నే ముంచిన ఘటాలు ఉన్నారని అన్నారు. వీర్ధండి బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలు ఉద్యమం చేయాలన్నారు. పదవిలో ఉన్న నాయకులు మీ ఊరికి వస్తే నిలదీయండంటూ పిలుపునిచ్చారు.