కేటీఆర్ కు ఆవేశ‌మెక్కువ‌..ఆలోచ‌న త‌క్కువ : మంత్రి సీతక్క

ఒక్క గ్రామానికే కొత్త ప‌థ‌కాల‌ను ప‌రిమితం చేసిన‌ట్లుగా భ్ర‌మ ప‌డుతున్నారు. చింత‌మ‌డ‌క సీఎంలం కాదు ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం. అర్హులందరికీ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌చేస్తాం ప‌థ‌కాలు రాని గ్రామాలు రణ‌రంగంగా మారుతాయ‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌లను మంత్రి సీత‌క్క ఖండించారు. నూత‌న ప‌థ‌కాల‌తో గ్రామాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌న్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. కొత్త ప‌థ‌కాల‌ను కేవ‌లం ఒక్క గ్రామానికే ప‌రిమితం చేసిన‌ట్లుగా కేటీఆర్ భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి మండలంలో ఒక గ్రామంలో నాలుగు నూత‌న ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ త‌ట్టుకోలేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. ఒక గ్రామంలో ప‌థ‌కాల అమ‌లును లాంఛ‌నంగా మొద‌లు పెట్టి….ఇత‌ర గ్రామాల‌కు విస్త‌రిస్తార‌న్న ఇంగిత జ్ఞానం లేక‌పోతే ఏలా అని ప్ర‌శ్నించారు. అర్హులందరికి సంక్షేమ ఫ‌లాలు అందించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష‌మ‌న్నారు.ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఉచిత విద్యుత్, స‌బ్సిడి గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాలు అర్హులంద‌రికి అంద‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గడుపుకోవ‌డ‌మే కేటీఆర్ ప‌ని అని మండిప‌డ్డారు. కేటీఆర్ కు ఆవేశ‌మెక్కువ‌..ఆలోచ‌న త‌క్కువ అని ఎద్దెవ చేసారు. బీఆర్ఎస్ లాగా ఎన్నిక‌ల ల‌బ్ది కోసం తాము ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం లేదన్న విష‌యాన్ని తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ద‌ళిత గిరిజ‌న కుటుంబాల‌కు ముడెక‌రాల భూమి, అన్ని ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత బంధు, బీసీల‌కు బీసీ బంధు, మైనారిటీల‌కు మైనారిటి బంధు హ‌మీని ఎంత మేర నెర‌వేర్చార‌ని ప్ర‌శ్నించారు. గ‌త సీఎం కేవ‌లం చింత‌మ‌డ‌క‌కే సీఎం అయిన‌ట్లు వ్య‌వ‌హ‌రించి..ప్ర‌తి ఇంటికి ప‌ది ల‌క్ష‌లు పంచి పెట్టార‌ని మండిప‌డ్డారు. కానీ త‌మ ప్ర‌భుత్వం అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తోంద‌ని తెలిపారు. గ‌త ప‌దేండ్ల‌లో పేద‌ల గృహ‌నిర్మాణాన్ని విస్మ‌రించి, కొత్త రేష‌న్ కార్డుల‌ను ఇవ్వ‌ని మీరు ఇప్పుడు మాయ‌మాట‌లు చెబితే ప్ర‌జ‌లు నమ్మె ప‌రిస్థితి లేద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment