ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు హర్షనీయం: ప్రజా సంఘాల నాయకులు
మంథని, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- ప్రణయ్ హత్య కేసు విషయంలో నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పట్ల ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రేమికులు ప్రణయ్ అమృతల చిత్రపటాలను ప్రదర్శిస్తూ మంగళవారం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ ని అతికిరాతకంగా హత్య చేశారని, ఇట్టి విషయంలో జిల్లా కోర్టు సంచలన తీర్పునిస్తూ A1 నిందితుడు మారుతి రావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని, A2 నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ మిగతా ఆరుగురి నిందితులకు యావజీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని ఇట్టి తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
కోర్టు తీర్పు కులదురహంకారులకు చెంప పెట్టని, ఇప్పటికైనా వారికి కనువిప్పు కలుగాలని కోరారు.
అదే విధంగా గతంలో మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో మంథని మధుకర్ ప్రేమ వ్యవహారంలో పరువు హత్యకు గురయ్యాడని, రీ పోస్టుమార్టం రిపోర్టును కోర్టు బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రఘోత్తం రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రేంకల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాబు రవి, కేవీపీఎస్ జిల్లా నాయకుడు మంథని లింగయ్య, కాంగ్రెస్ నాయకులు బూడిద తిరుపతి, బెజ్జంకి దిగంబర్, అజీమ్ ఖాన్, శరిపొద్దీన్, ఇరుగురాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.