తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్, బోనగిరి, వలిగొండ, గజ్వేల్ ప్రాంతాల భూ నిర్వాసితులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జై రామ్ గడ్కారీ ని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో, భూ నిర్వాసితులు నార్త్ సైడ్ RRR అలైన్మెంట్‌ను 28 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్లకి మార్చాలని ప్రభుత్వానికి పిర్యాదు చేశారు. ప్రస్తుతం నార్త్ సైడ్ అలైన్మెంట్ 28 కిలోమీటర్లపై ఉండడం వల్ల చౌటుప్పల్, బోనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీ ప్రాంతాలు రెండు లేదా మూడు భాగాలుగా విడిపోతున్నాయి.
దీనివల్ల హెచ్ఎండిఏ ప్లాట్లు, విలువైన భూములు, గృహాలు నష్టపోతున్నాయని వారు వాపోయారు. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం దక్షిణ భాగంలో ORR నుండి 40 కిలోమీటర్ల వరకు RRR అలైన్మెంట్ మార్చింది, అలాగే నార్త్ సైడ్ అలైన్మెంట్ కూడా అదే రీతిలో మార్చాలని భూ నిర్వాసితులు కోరారు. సమావేశంలో పాల్గొన్న భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి మరియు ఇతరులు, ఈ అంశం పై గడ్కారీ కి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈ సమస్యపై గడ్కారీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం సభ్యులు గుజ్జుల సురేందర్ రెడ్డి, మరుపాక లింగం గౌడ్, దబ్బేటి రాములు గౌడ్, జాల వెంకటేష్ యాదవ్, బోరం ప్రకాష్ రెడ్డి, కొడారి నర్సింగరావు, మోదుగు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.