*బీసీ కులగణనపై బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి*
*బీసీలకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు*
*బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి బీసీలను అవమానించింది*
*కులగణన రాహుల్ ఆలోచన.. సీఎం రేవంత్ రెడ్డి ఆచరణ*
*గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి కొండా సురేఖ.*
ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్న రాష్ట్రంలోని 56 శాతం బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని సంకల్పించిందని, బీసీ కుల గణనపై జరిగే కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, అసెంబ్లీలో, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బీసీలను అవమానించారని మండిపడ్డారు. కులగణన రాహుల్ గాంధీ ఆలోచన అని, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో సాధ్యం చేసి చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే – 2024 ప్రకటన ఇటీవల ప్రవేశపెట్టిన సందర్భంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకరయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేషంతో కలిసి కొండా సురేఖ విలేకరులతో మాట్లాడారు.
గత కొన్ని దశాబ్ధాలుగా రాష్ట్రంలో బీసీల సంఖ్య పెరుగుతున్నా, సామాజిక న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలను గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమస్యను తీర్చేందుకే తమ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీల కుల గణన చేపట్టినట్టు చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఆలోచనతో కుల గణన చేశామన్నారు. కుల గణనకి సంబంధించిన స్టేట్ మెంట్ మీదనే అసెంబ్లీ, శాసనమండలిలో తమ ప్రభుత్వం డిస్కసన్కు అనుమతి ఇచ్చినట్టు చెప్పాఆరు. ఇంత కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ చట్టసభ సభ్యులు సమావేశాల మధ్యలోనే వెళ్లిపోవడంతో సరికాదు అన్నారు. ఈ చర్య ద్వారా వారికి బీసీలపై ప్రేమ ఎంత ఉందో అర్థం అవుతుందని సురేఖ గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీల కోసం ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. కనీసం వారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అయినా బయట పెట్టారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం బీసీల కోసం చేస్తున్న కృషిని పక్కదారి పట్టించేందుకు, బీఆర్ఎస్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా కుల గణన పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, కుల గణన అమలును అడ్డుకుంటే బీసీలకే నష్టమని సురేఖ అభిప్రాయపడ్డారు. తాను రెండు కులాల ప్రతినిధిగా చెప్తున్నానని, కుల గణన ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు.