పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు నేర్పించాలి: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 05, సమర శంఖం ప్రతినిధి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలని, అప్పుడే సమాజాన్ని అర్థం చేసుకునే మంచి నాయకులు తయారవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం సన్ సిటీలోని “గ్లెన్డేల్ అకాడమీ (Glendale Academy)” లో నిర్వహించిన “లీడర్ షిప్ డే – 2025” కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేవలం మార్కులు మాత్రమే జీవితం కాదని, తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రతిభ చూపేలా చిన్నారులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు. ప్రతి చిన్నారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని.. ఇతరులతో పోల్చి వారిపై ఒత్తిడి తేవొద్దన్నారు. అబ్దుల్ కలాం మాటలను స్పూర్తిగా తీసుకొని విద్యార్థి దశలోనే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని… దాన్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి రోజు కొత్త అంశాలను నేర్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తరుణంలో వినూత్నంగా ఆలోచించాలన్నారు. అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.
కార్యక్రమంలో జీఎస్ జీ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్ అవ్నీష్ సింగ్, గ్లెన్డేల్ గ్రూప్స్ డైరెక్టర్ మీనూ సలూజా, లైఫ్ కోచ్ అండ్ మెంటార్ డా.కన్నన్ తదితరులు పాల్గొన్నారు.