యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 02, సమర శంఖం ప్రతినిధి:- కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
బుధవారం ‘రామ్ ఇన్ఫో లిమిటెడ్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ‘ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తేనే విజయాన్ని అందుకోగలమన్నారు. లేదంటే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ముఖ్యంగా పరిశ్రమలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభించిన ప్రతి స్టార్టప్ విజయవంతం కాదని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచనలతో అడుగు ముందుకేస్తేనే సక్సెస్ అవుతుందన్నారు. స్టార్టప్స్ ఏర్పాటు, వాటి నిర్వహణలో మార్గనిర్దేశనం చేసేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశంలో ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ మార్కెట్ విలువ ఏటా 700 బిలియన్ డాలర్లు ఉంటుందన్నారు. ఈ రంగంలో స్టార్టప్స్ కు మార్గనిర్దేశనం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన బీ2జీ (బిజినెస్ 2 గవర్నమెంట్) రెవెన్యూ యాక్సిలేటర్ ‘ఐకొలాబ్ హబ్ ఫౌండేషన్ ’ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. 2030 నాటికి 100 స్టార్టప్ కంపెనీల ఆదాయాన్ని రూ.100 కోట్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాక్షించారు.
కార్యక్రమంలో ఏపీ సీఎం ఐటీ సలహాదారు జేఏ చౌదరీ, రిటైర్ట్ ఐఏఎస్ ఆలోరియా జీఆర్, టీ హబ్ సీఐవో సుజిత్ జాగీర్దార్, ఐకొలాబ్ హబ్ ఫౌండేషన్ ఛైర్మన్ డా.శ్రీనాథ్ రెడ్డి, బోర్డు మెంబర్ వర్ల భానుప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.