యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్

యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్

జనసేన ఆవిర్భావ సభ కమిటీలతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.

పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ర్టైక్‌ రేట్‌ తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్‌ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

హోలీ పండగ నాడు నిర్వహిస్తోన్న ఈ సభను పండగ వాతావరణంలో జరుపుకొందామని చెప్పారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేనే అనుకునేట్టుగా మనందరం కలిసి పని చేద్దామని అన్నారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు… సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో నాదెండ్ల మనోహర్ కాకినాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించారని, పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎన్నో కష్టనష్టాలు, అటుపోటులను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారని అన్నారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎనాడూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఆయన పని చేయలేదని, మానవత్వం, నిజాయతీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారని, దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్టైక్ రేట్ తో ఈ రోజు మనం విజయం సాధించామని, పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం” అని వివరించారు.

రాష్ట్ర రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్

పొత్తు నిలబెట్టడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారని, బీజేపీ కోసం తన సీట్లను త్యాగం చేశారని, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పరామర్శించడానికి వస్తుంటే ఆయన విమానం టేకాఫ్ కాకుండా చేశారని గుర్తు చేశారు.

రోడ్డు మార్గంలో వస్తే బోర్డర్ లో పోలీసులు అడ్డుకున్నారని, జోరు వానలో జన సైనికులు, వీర మహిళలు ఆయనకు ఎంత అండగా నిలబడ్డారో ఆనాడు మనం చూశామని, రాష్ట్ర రాజకీయాల్లో అదే టర్నింగ్ పాయింట్ అని అన్నారు. అది ఎవరూ మరిచిపోకూడదని, చంద్రబాబును పరామర్శించిన అనంతరం పొత్తుపై ప్రకటన చేశారని, బీజేపీని ఒప్పించి కూటమి కట్టడానికి కారకుడయ్యారని, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మనందరం ఆయన వెనుక నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎవరికి, ఎప్పుడు, ఏం చేయాలో ఆయనకు తెలుసు

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇగోలు పక్కన పెట్టి మనందరం కలిసి పనిచేయాలని, చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటే మనం మాట్లాడుకుంటే సమసిపోతాయని, కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమానమేనని, ఒకరు ఎక్కువ… ఇంకొకరు తక్కువ కాదని, అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ధీమా వ్యక్తం చేశారు.

మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఆయన తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని, రాజకీయంగా మనందరికీ ఆకాంక్షలు ఉంటాయని, చిన్న చిన్న పదవులు ఆశిస్తామని, అధ్యక్షులు దృష్టిలో అన్ని ఉన్నాయని, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment