నూతన గ్రూప్ 4 సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్
విధులను పారదర్శకంగా నిర్వహిస్తూ తమ పరిధిలోని వార్డులను మోడల్ వార్డులుగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం ఎన్టిపిసి లోని మిలీనియం ఆడిటోరియంలో నూతనంగా గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వార్డ్ అధికారులు జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…. తెలంగాణ మున్సిపల్ చట్టం పై నూతనంగా ఎంపికైన వార్డు అధికారులు, ఇతర గ్రూప్ 4 ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వార్డులో పారిశుధ్య పనులను ప్రతి రోజు పర్యవేక్షించాలని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, త్రాగు నీటి సరఫరా, వివిధ రకాల సేవలు ప్రజలకు త్వరితగతిన అందేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణంలో గ్రీనరీ పెరిగేందుకు అవసరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ ప్లేసెస్ లో పారిశుధ్యం పకడ్బందీగా ఉండేలా చూడాలని, రోడ్లపై ఎక్కడ చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ తెలిపారు. వార్డులలో చేపట్టే అభివృద్ధి పనులలో నాణ్యత తగ్గకుండా పర్యవేక్షించాలని అన్నారు.