జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రణాళికా.. ఎండోమెంట్ శాఖ సమీక్ష
హైదరాబాద్, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని, తక్షణ పనుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎండోమెంట్స్ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం ప్రజా భవన్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఆగమా శాస్త్ర పండితులు గోవింద హరి, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక పనులు, దీర్ఘ కాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈనెల 20 వ తేదీ నాటికి తాత్కాలిక, తక్షణ పనులను ఎంపిక చేసి నివేదిక అందజేయాలని కమిటీకి కాల పరిమితిని నిర్ణయించారు.
తాత్కాలిక పనులలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ఆలయ చరిత్రతో ప్రచార బోర్డులు పెట్టాలని, అందుకు బస్సు స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
దీర్ఘ కాలిక పనులలో బోటింగ్, టూరిజం అభివృద్ధి, అతిథి గృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆర్చిల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా చిన్నారెడ్డి పలు సూచనలు చేశారు. అత్యంత ప్రాధాన్యతతో పనులు చేపట్టాలని, లక్ష్యం మేరకు ముందుకు సాగాలని చిన్నారెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.