నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యలు.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, నగర మేయర్ పునుకొల్లు నీరజ లతో కలిసి రూ. 190 లక్షల మునిసిపల్ నిధులతో ఆధునికీకరించిన సారధినగర్- మామిళ్ళగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు ఉపయోగపడాలని, తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే, రైల్వే అధికారులను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. తర్వాతి ప్రభుత్వం లో ఉండగా, నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు. తిరిగి గత సంవత్సరం పనులు చేపట్టి, సంవత్సర కాలంలోనే పట్టుబట్టి, సమస్యలు పరిష్కరించి, పనులు పూర్తి చేసుకొని ఉపయోగంలోకి తెచ్చుకున్నామన్నారు.నగర ప్రజలే కాక, జిల్లా ప్రజలకు వెలుగుమట్ల పార్క్ ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామని అన్నారు. నగరానికి దగ్గర్లో 500 ఎకరాల స్థలం దొరకడం జిల్లా ప్రజల అదృష్టమని తెలిపారు. ఖమ్మం ఖిల్లా ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి రోప్ వే మంజూరు చేసుకున్నట్లు, ప్రతిరోజు ఖిల్లా నుండి పట్టణ ప్రాంతాన్ని సందర్శించే విధంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి అన్నారు. కుటుంబ సభ్యులు ఏ జబ్బులకు గురికాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచాలని, దీనిపై మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఇంకా శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఖమ్మం పట్టణం ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.పట్టణీకరణ బాగా జరుగుతుందని, గ్రామీణ ప్రజలు బ్రతుకుదేరువు కోసం, వైద్యం, సౌకర్యాల కోసం పట్టణాలకు వస్తున్నారని, ప్రతి సంవత్సరం పట్టణ జనాభా పెరుగుతుందని మంత్రి తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యతగా, భవిష్యత్ తరాలకు వీలుగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలని, క్రమపద్ధతిలో పట్టణాల అభివృద్ధి చేపట్టాలని, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. మురికికూపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడిప్పుడే తేరుకుంటుందని, అభివృద్ధికి నిధులు, ప్రజల సహకారం కావాలని మంత్రి అన్నారు. నష్ట పోయే ప్రజలకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి తెలిపారు. ఇటీవలి వరదల్లో సర్వం కోల్పోయి, నరకయాతన అనుభవించి, కట్టుబట్టలతో ప్రజలు వచ్చినప్పుడు చాలా బాధ కలిగినట్లు మంత్రి అన్నారు. మనం చేసిన కర్మలతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు, నాలాలు, అలుగులు పూడ్చామని, అన్నిటిపై కట్టడాలు కట్టి, నీరు పోకుండా చేస్తే, నీరు మన ఇండ్లలోకి వచ్చిందని అన్నారు. రోడ్ల విస్తరణ, కాల్వలు త్రవ్విన భవిష్యత్ కోసం చేపడతామని, ప్రజల సౌకర్యాలు, సంతోషానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు.పోలీసులు లా అండ్ ఆర్డర్ నిర్భీతిగా, నిక్కచ్చిగా చేపట్టాలని, డ్రగ్స్, గంజాయిపై పకడ్బందీ నియంత్రణ చేయాలని మంత్రి అన్నారు. ఉన్నతాధికారులు వారానికి ఒకసారి సమావేశమై, జిల్లాలో సమస్యలు, చేపట్టాల్సిన పనుల గురించి చర్చించుకుని, అభివృద్ధి, సంక్షేమం కొరకు ఏం చేయాలో ప్రణాళిక చేసి, కార్యాచరణ చేయాలని, జిల్లా సస్యశ్యామలంగా, అన్ని వర్గాల వారు అన్నదమ్ముల్లా కలిసి వుండేలా తోడ్పాటు అందించాలని మంత్రి అన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, 50 శాతానికి ఎక్కువ జనాభా పట్టణాల్లో నివసిస్తుందని అన్నారు. జిల్లాలో సర్వే పూర్తి చేసుకున్నట్లు, జనాభా 27 లక్షలు ఉండగా, కార్పొరేషన్ జనాభా సుమారు ఆరున్నర నుండి ఏడు లక్షల వరకు ఉంటుందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ ఏర్పరచుకొని, పట్టణాల అభివృద్ధి చేయాలని, రోడ్లు, వీధి వ్యాపారులు, వసతులు, గ్రీన్ స్పెస్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పట్టణంలో ప్రతి సౌకర్యం అద్భుతంగా అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స, డాక్టర్ల వ్యవహారశైలి, అందుబాటులో మందులు, రోగులకు సేవలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, టీచర్ల హాజరు అన్ని అంశాలపై దృష్టి పెట్టామన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్కుపై దృష్టి పెట్టి, ప్రజలు సందర్శించేలా ప్రణాళిక చేపట్టామన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి సెంట్రలైజ్ కిచెన్ పెట్టి, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టామని,12 పాఠశాలల్లో వుయ్ కెన్ లర్న్ కార్యక్రమం చేపట్టి మన పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక చేశామన్నారు. ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకున్నప్పుడు, చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టే అవసరం ఉంటుందని, అటువంటి దూరదృష్టి, ఆలోచనతో మంత్రివర్యులు మార్గదర్శనం చేస్తున్నారని అన్నారు.ఇది అండర్ బ్రిడ్జి ప్రారంభం అయినా, ఎంతో అవస్థలు పడుతున్న ప్రజల అవసరాలు తీర్చడానికి పెట్టుకున్న కార్యక్రమం అని అన్నారు. నిజంగా అవసరం ఎక్కడ ఉందో గమనించి పెట్టుకున్న అద్భుతమైన ప్రక్రియ అని, ఇంకా అవసరాలు త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment