అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

అమరావతిలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జరగనున్న సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అయినవోలు గ్రామంలోని రామాలయం సెంటర్‌లో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతిలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, చైతన్యం కలిగిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. రాజధాని నిర్మాణానికి చారిత్రాత్మకంగా దాదాపు 34,000 ఎకరాల భూములను కేవలం 50 రోజుల్లో రైతులు స్వచ్ఛందంగా అందించారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. భూములు ఇచ్చిన 29 గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నగరాభివృద్ధికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని తెలిపారు.గత ప్రభుత్వం పరిపాలనా అనుభవం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మంత్రి నాదెండ్ల విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే విధ్వంసానికి పాల్పడి, అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను నిలిపివేయడం, రోడ్లను ధ్వంసం చేయడం, కేబుళ్లను తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఒకే రాజధానికి రెండవసారి ప్రధానమంత్రి శంకుస్థాపనకు రావడం అరుదైన ఘట్టమని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎర్రబాలెం, బేతపూడి, అయినవోలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment