ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్య లను ఆపవచ్చు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

తెలంగాణ లో గత ముప్పయి రోజుల్లోనే ఆరు మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలి.

ప్రియమైన పోలీసు మిత్రులారా,

గత ముప్పై సంవత్సరాలుగా నేనూ ఆయుధాల మధ్యనే బతుకుతున్నా. సర్వీసులో ఎన్నో చెప్పుకోలేని అవమానాలు, నిరాశలు, సహచరుల అకాల మరణాల్లాంటి ఎన్నో బాధలు ఎదురైనవి. కొన్ని నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కూడా. అయినా కూడా నేను ఎన్నడూ తాగుడుకు బానిస కాలేదు, నాకు ఎన్నడూ చావాలనిపించలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఈ ఆలోచన రాదు. ఆ రహస్యం ఏంటో మీకు చెప్పాలని ఉంది. దీని వల్ల మీరు సజీవంగా, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే చిన్న ఆశ నాకు ఉంది.

నేను ఐపీయస్ అధికారిని ఐనా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదల తో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం సాధించడం..

తరువాత పోలీసు అకాడమీలో ట్రైనింగ్ ఒక గొప్ప అనుభూతి . అది జీవితానికి ఒక గొప్ప క్రమశిక్షణ ను అలవాటు చేసింది. మూడు దశాబ్దాలుగా నాకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని (పోలీసు ఉద్యోగం) నిరంతరం ప్రజలకు నాకు చేతనైనంత మేలు చేయడానికే వాడాను. మీరు కూడా అలాగే వాడాలి. ఈ విషయాన్ని చాలా రోజుల తరువాత విక్టర్ ఫ్రాంకెల్ రాసిన ‘అర్థం కోసం అన్వేషణ’ పుస్తకం లో చదివాను. మీరు కూడా చదవండి. మీకు చావాలనిపించదు. 

నేను పోలీసు ఉన్నతాధికారి కావడం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు చివర్లో ఉన్న మా కాలనీ ప్రజలకు, నా స్నేహితులకు, ఒక గుర్తింపు దొరికింది. నేను పోలీసు వాహనంలో మా ఊరికి పోయినప్పుడు మా బస్తీ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. మీ అందరికీ ఇలాంటి అనుభవాలే ఎదురై ఉంటయి. మీరందరూ, మీ మీ సమూహాల్లో సెలబ్రిటీలు. మీ గురించి మీ తల్లిదండ్రులు మీకు తెలవకుండా చాలా గొప్పగా ఊర్లో చెప్పుకుంటరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ కుటుంబాలకు, మీ సమాజానికి సమూహానికి ఒక గొప్ప బలం. మనంతటికి మనం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆలోచించండి.

అసలు రోజూ చావులను ఎఫ్ ఐఆర్ లు, పంచనామాలు, పోస్టుమార్టంల రూపంలో చూసే మనకు చావాలన్న ఆలోచన రావడమే విడ్డూరంగా ఉంది! అయినా మనుషుల ప్రాణాలను కాపాడడానికి జీతం తీసుకునే మనం, మన ప్రాణాలు మనమే తీసుకొనుడేంది??

మీకు తెలుసా? 

మన వల్ల మనకు తెలియకుండానే ఎన్నో జీవితాలు రోజూ సురక్షితంగా ఉంటాయో? గొప్ప విలువ ఉన్న ఇలాంటి జీవితాన్ని, ఒక పిరికి ఆలోచనతో క్షణికావేశంలో నాశనం చేసుకోకూడదు.

మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి రోజుల తరబడి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. తప్పులను డిలీట్ చేసుకొని మనం ముందుకు సాగాల్సిందే. నిజం చెప్పాలంటే ఎవరి బతుకుల్లో వారు బిజీగా ఉన్నారు.

ఆరోగ్యం బాగాలేక పోతే డాక్టర్ దగ్గరికి పోవాలి, మరో మహిళ/పురుషుడు మన జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే అర్జెంటుగా మన జీవిత భాగస్వామితో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా షేర్ చేసుకోవాలి, పరిష్కారం కనుగొనాలి. అంతే గాని అందరికీ తెలుస్తదని భయపడి ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడరా? 

నా అనుభవం తో, కొంతమంది నిపుణులు, పోలీసు ఆఫీసర్లతో మాట్లాడి కింది సలహాలను ఇస్తున్నాను. దయచేసి చదవండి-పాటించండి.

1. జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్త పడండి. డేటింగ్ చెడ్డదేం కాదు. ట్రై చేయండి. వరకట్నం ఆపండి. పెళ్లి వ్యాపారం కాదు. మీ కుటుంబం ఫోటోను మీరు పనిచేస్తున్న ప్రదేశంలో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్ వాల్ పేపర్ గా మార్చుకోండి.

2. మీరు డ్యూటీ లు బాగా చేయండి, డ్యూటీ అయిపోయిన తరువాత మాత్రం కుటుంబం తో గడపండి, సెల్ ఫోన్ తో కాదు.

3. వీలయినప్పుడల్లా కనీసం రోజుకు గంట సేపు వ్యాయామం చేయండి. పోలీసు అకాడమీ రోజులను గుర్తు చేసుకోండి. బిజీ గా ఉన్నామని మాత్రం తప్పించుకోకండి.

4. బందోబస్తులో ఉన్నపుడు ఖాళీ సమయాన్ని ఫోన్లో బెట్టింగ్, ఈజీ లోన్, చాటింగ్ యాప్ లకు కేటాయించకుండా మంచి పుస్తకాలు చదవండి.

5. దయచేసి ఏదైనా ఒక గేమ్ ను (ఆన్లైన్ కాదు) అలవాటు చేసుకోండి. క్రీడాకారులు ఆత్మహత్యలు చేసుకోరు గమనించండి.

6. బెట్టింగ్, సట్టా, మట్కా, చీప్ లోన్, ఫేక్ క్రిప్టోకరెన్సీ ఇవన్నీ గంజాయి లాంటి వ్యసనాలు. వీటికి దూరంగా ఉండండి.

7. పోలీసులకు ప్రత్యేకంగా అపరిచిత వ్యక్తులతో చాటింగ్ బెడద ఉంటది. అలాగే మన దగ్గరికి నిస్సహాయ పరిస్థితి లో వచ్చిన వ్యక్తుల బాధను అర్థం చేసుకోవాలి, సహాయం చేయాలి కాని వాళ్లతో రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు

8. ఎవరైనా పై అధికారులు సైకోల్లాగా ప్రవర్తిస్తే, సెలవు పెట్టి వెళ్లండి లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి

9. మానసిక ఒత్తిడి ఉన్నపుడు కౌన్సిలర్ల వద్దకు వెళ్లి మీ సమస్యలు వారికి చెప్పుకోండి. ఉపశమనం కలుగుతుంది.

10. బాగా డబ్బు సంపాదించే ఆలోచన ఉండడం తప్పు కాదు. మీ కుటుంబ సభ్యులతో ఉద్యోగం లేదా వ్యాపారం చేయించండి. వాళ్లకు మీ రోజువారీ ఉద్యోగంతో, నేరస్తులతో సంబంధం లేకుండా చూసుకోండి.

11. దయచేసి లంచాలకు, మామూళ్లకు(మంత్లీస్), అక్రమ సంపాదనకు దూరంగా ఉండండి. ఆ ఏసీబీ విజిలెన్స్ కేసులనుండి బయటపడాలంటే తీసుకున్న లంచం కన్నా వంద రెట్లు ఖర్చవుతుంది. అదెలా జరుగుతుందో మీకందరికీ తెలుసు.

12. సంవత్సరానికి ఒకసారి విపాసన (మెడిటేషన్) లేదా విహారయాత్రలకు కుటుంబంతో వెళ్లండి. మీరు పది రోజులు డ్యూటీలో లేకపోతే కొంపలేం మునగవు.

13. పక్క పోలీసు/ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులతో పోల్చుకోకండి. మనశ్శాంతి ఉండదు. కనిపించేదంతా బంగారం కాదు. ఎవరి బాధలు వాళ్లకుంటయి.

14. మీకిష్టమైన వ్యక్తుల పేరు మీద స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేయండి.

15. మీ కిష్టమైన మంచి పేరున్న పై అధికారులను(సర్వింగ్/రిటైర్డు) మార్గదర్శులు గా తీసుకోండి. వారిని తరచుగా కలవండి.

పోలీసు ఉన్నతాధికారులకు విన్నపం:

1. పోలీసు ట్రైనింగ్ లో ఏదో తీవ్రమైన లోపం ఉంది. అవుట్ డోర్ ను కొంత కఠినతరం చేయండి. చాలా మందికి సెల్యూట్ కూడా సరిగా రావడం లేదు. 

2. పోలీసు కుటుంబాలకు కు ఉచిత కౌన్సిలర్ సౌకర్యం కల్పించండి. సఖీ సెంటర్లు మన కుటుంబాలకు కూడా అవసరం.

3. తరచుగా పండుగల తరువాత పోలీసు కుటుంబాలతో బఢాఖానా(గెట్ టుగెదర్)లు నిర్వహించండి. వాటిని నామ్ కే వాస్తే గా పెడ్తే ఆఫీసర్లు కేవలం షామియానా బిల్లులు పట్టుకొస్తరు.

4. చిన్న చిన్న తప్పులకు ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్ లతో ఇబ్బంది పెట్టకండి. దయచేసి కౌన్సిలింగ్ ఇవ్వండి.

5. బెట్టింగ్,లోన్లు, మద్యం, చాటింగ్, అక్రమ సంభందాలకు బానిసలైన ఉద్యోగుల కోసం జిల్లాలో/బెటాలియన్లలో ‘డీ అడిక్షన్ సెంటర్లను’ ఓపెన్ చేయండి.

6. బహుశా ఆదర్శంగా బతుకుతున్న కుటుంబాలకు గుడ్ సర్వీసు ఎంట్రీ, కమెండేషన్ లెటర్, బెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద వీక్, మెడల్స్ ఇవ్వవచ్చేమో ఆలోచించండి.

7. ప్రతి పోలీస్ స్టేషన్ లో క్రీడలకు వెసులుబాటు కల్పించండి.

8. ఆరోగ్య భద్రత బిల్స్ రెగ్యులర్ గా వచ్చేట్లు చూడండి.

9. సరెండర్ లీవులు టీఏలు రెగ్యులర్ గా చెల్లించండి.

10. పోలీసు ఫైనాన్స్ కార్పోరేషన్ లేదా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చెస్తే ఈజీ లోన్ల బారిన పడరు. ఆలోచించండి.

Join WhatsApp

Join Now

Leave a Comment