ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహణ: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మంథని / పెద్దపల్లి, మార్చి-07, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలలో మార్చి 10 నుంచి 14 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించేందుకు మార్చి 10 నుంచి 14 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గ్రామంలోని ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్ తరలించాలని అన్నారు.
గ్రామంలోని కాలేజ్ స్థలాల్లో ప్లాస్టిక్ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని అన్నారు. గ్రామాలలో పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని, కాలేజ్ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపుకు అయ్యే ఖర్చు సదరు స్థలం యజమాని నుంచి వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీటి ప్రవాహకానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, స్మశానవాటిక, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను, ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్స్ ఫీజులు మార్చి 15 లోపు 100% వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని అన్ని వార్డులలో ఫాగ్గింగ్ చేయించాలని, మాంసాహారం విక్రయించే దుకాణాలలో తాజా వస్తువులు మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని పైప్ లైన్ లీకేజీ లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నీటి ట్యాంకులను రెగ్యులర్గా క్లోరినేషన్ చేయాలని సానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ను అందరూ ఎంపీఓలు, ఎంపీడీవోలు, డి ఎల్ పి ఓ లు,డిపిఓ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.