జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల వేలకోట్లు కేటాయించాలి
–సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలి
– కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శనివారం ఆలేరు మండల పరిధిలోని పటేల్ గూడెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకుని, వారితో సంఘ సభ్యత్వం చేర్పించిన అనంతరం వారి ఉద్దేశించి నర్సింహ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో కొత్త కొత్త జీవోలను తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని విమర్శించారు. రోజురోజుకు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక అనేకమంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ పని డిమాండ్ పెరుగుతున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించేది పోయి తగ్గిస్తూ వస్తున్నదని ఆవేదన వెలిబుచ్చారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2.5 లక్షల వేల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 86 వేల కోట్ల రూపాయలు కేటాయించడం అత్యంత ధారణమని అన్నారు. పార్లమెంటు సాక్షిగా మంత్రులే జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలను తగ్గిస్తున్నామని చెప్పడం బిజెపి ప్రభుత్వానికి జాతీయ గ్రామీణ ఉపాధి విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఉపాధి హామీకి తగిన నిధులు కేటాయించి, పని దినాల సంఖ్య పెంచి, వేతనం కూడా రోజుకు 800 రూపాయలు ఇవ్వాలని అన్నారు. చట్ట ప్రారంభ దశలో ఉన్న మౌలిక వసతులను కూడా పని ప్రదేశాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డు ఇచ్చేదని, ఈ నెల రోజుల నుండి మాత్రం దరఖాస్తు చేసుకుంటే కార్డు ఇవ్వడం లేదని, చట్టంలో మాత్రం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని ఉంటే దాన్ని అమలు చేయకపోవడం చాలా హేయమైన చర్యని అన్నారు. మరోపక్క ఉపాధి హామీలో పనిచేయలేదని, జాబు కార్డు లేదని భూమిలేని వారికి కూడా ఆత్మీయ భరోసా వర్తించదని అనడం కరెక్ట్ కాదని భూమిలేని ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాలు వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గ్యార అశోక్ పాల్గొని మాట్లాడగా, సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సంఘం నాయకులు గ్యార భాస్కర్, గ్యార ఎల్లయ్య, గ్యార బిక్షపతి, కార్మికులు గ్యార రజిత, ఎమేలియ, జయమ్మ, కమల, లలిత, మమత, వజ్రమ్మ, కోయ జ్యోతి, పొన్నపు హేమలత, సుంకరి ఎల్లమ్మ, పిల్లిట్ల కుమారు, మురళి, అమరేందర్, సత్తయ్య, విష్ణు, పరుశురాములు, రాజయ్య, ముకుందం, మమత, వసంత, ఇందిరా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.