అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..
7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్!
అమరావతి, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభంకానున్నాయి.
పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.
గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమంతోపాటు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది విద్యార్ధులు, తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు.
రెగ్యులర్ విద్యార్థులతోపాటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్ధులకు కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక విద్యార్ధులు 30,334 మంది హాజరుకానున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నా్యి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.