నకిలీ టికెట్లతో భక్తులని మోసంచేస్తున్న కేటుగాళ్లు

నకిలీ టికెట్లతో భక్తులని మోసంచేస్తున్న కేటుగాళ్లు

తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాలకు ప్రతి రోజూ లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇక, పండగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తుంటారు. తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మెుక్కులు చెల్లించుకోవాలని ఆశ పడుతుంటారు.అయితే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు కొన్నేళ్లుగా రెచ్చిపోతున్నారు. ఆలయాల సిబ్బంది రూపంలోనో లేదా స్థానికంగా ఉంటూనో భక్తులను మోసం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడి అదే పనిగా డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా దర్శన టికెట్లకు సంబంధించిన మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు వచ్చిన వారి నెత్తిపై శఠగోపం పెడుతున్నారు కేటుగాళ్లు. నకిలీ టికెట్లు అంటగడుతూ నిలువునా దోచేస్తున్నారు. నకిలీ టికెట్లతో వెళ్లిన వారికి ఆలయాల సిబ్బంది చెప్పే మాటలు షాక్ ఇస్తున్నాయి. వందల వేలు పోసి టికెట్లు కొంటే అవి నకిలీ అని తేలడంతో లబోదిబోమంటున్నారు.తాజాగా అలాంటి ఘటనే శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14న శ్రీశైలం మల్లన్న దర్శనానికి కొంతమంది భక్తులు వచ్చారు. దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు వేల రూపాయలు కాజేసి వారికి నకిలీ టికెట్లు అంటగట్టారు. వాటిని తీసుకుని సదరు భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. తమ వంతు వచ్చే సరికే స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్లి ప్రయత్నం చేశారు. అయితే టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో వారిని సిబ్బంది నిలువరించారు. వాటిని ఫేక్ టికెట్స్‌గా తేల్చారు. దీంతో భక్తులు, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దర్యాప్తు చేపట్టిన ఒకటో పట్టణ పోలీసులు నిందితులను గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment