సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండా సురేఖ
వరంగల్, ఏప్రిల్ 05, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 27వ డివిజన్ లో రేషన్ దుకాణాలను లబ్ధిదారులకు సన్న బియ్యం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్న బియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని లబ్ధిదారులు కూడా దానిని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడి రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారిని నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రతి లబ్ధిదారుడు సన్న బియాన్నే వినియోగించుకుంటూ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసినట్లు అయిందని మంత్రి సురేఖ తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలతో అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు.