ఫార్ములా ఈ రేసింగ్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని వ్యాఖ్య
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో తనకు మళ్లీ నోటీసులు పంపిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, 17న తనకు నోటీసులు ఇస్తారని ఆయన అన్నారు. తనను విచారణకు పిలిచి నాటకాలు ఆడే అవకాశముందని, ఫార్ములా రేసింగ్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అన్నారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు రూ. 45 కోట్లు ఖర్చు చేస్తే తప్పు అని చెప్పారని, మరి అందాల పోటీలకు రూ.200 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి జరిగే లాభమేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ పెడతానని చెబుతున్నారని, అందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలు రాబోతున్నందునే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఉన్న బలంతోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు అబద్ధాలు, బుకాయింపులతో సాగుతున్నాయని అన్నారు