రైతులకు ప్రభుత్వం శుభవార్త
విశాఖపట్నం జిల్లాలో ఉన్న రైతులకు శుభవార్త. విశాఖపట్నం రైతు బజార్లో గుర్తింపు పొందిన కొంతమంది రైతులు ప్రతిరోజు కూరగాయలు తీసుకువచ్చి నగరవాసులకు అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు కొంతమందికే ఈ అవకాశం లభించింది. మరి కొంతమంది రైతులు అధిక శాతం పంటలు పండించినప్పటికీ బయట అమ్మకాలు చేస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక్కసారిగా పంట చేతికి వస్తే ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. జిల్లాలో రైతులకు పంట ఉంటే ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా రైతు బజార్లలో సరుకులు అమ్మకాలు చేయడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర సంచాలకులు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో గల కూరగాయల పండిచే రైతులకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం కూరగాయల పంట సీజన్ అయినందున ఎక్కువ సంఖ్యలో సరుకు దిగుబడి రావడం, గ్రామాల్లో తగినంత ధర రాకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నట్లయితే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా సరుకును నేరుగా తీసుకువచ్చి రైతు బజార్లలో అమ్ముకొనేందుకు అవకాశం కల్పించారు. పంట ఉన్న రైతులకు సమస్యలు ఎదురైతే వెంటనే మీ పల్లెలలో గానీ, మండలాలలో గానీ అందుబాటులో ఉన్న ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను కలిసి తగిన వివరాలు ఇస్తే జిల్లాలో ఉన్న సహాయ మార్కెటింగ్ సంచాలకుల వారి ద్వారా మీ సరుకును మీకు దగ్గరగా ఉన్న రైతు బజారులో నేరుగా అమ్ముకొనే అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.