అక్కడ వజ్రాలే కాదు, బంగారం కూడా అంట. నిజమేనంటారా?
రాయలసీమ కరువు ప్రాంతంలో కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ ప్రాంతమంతా ఎటు చూసినా ఎతైన కొండలు, గుట్టలే దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు కూడా తక్కువే. కరువు నేలలో బంగారం లభ్యం అవడం ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తే చాలు ఆ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుంది.ఒక్క జిల్లా వాసులే కాకుండా అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వజ్రాల వేట కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఎక్కడ చూసినా బంగారం మాటే వినబడుతుంది. ఈ ప్రాంతంలో విశేషంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికితీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని ‘జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది.